ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘వాహన మిత్ర’ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. పథకం ప్రకారం, అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సాయం అక్టోబర్ 1వ తేదీన నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ కానుంది. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తమ కుటుంబ అవసరాలు, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా వంటి అంశాలను భరించేందుకు సాయం లభిస్తుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అధికారులు సన్నాహాలు చేపట్టి, దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు సమీప గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ సమాచారాన్ని దరఖాస్తుదారులు డిక్లరేషన్ రూపంలో ధృవీకరించాలి. అంటే అందించిన సమాచారం అసత్యమైందని తేలితే చట్టపరమైన చర్యలకు తాము సిద్ధమని అభ్యర్థి అంగీకరించాలి. దరఖాస్తుల పరిశీలన సెప్టెంబర్ 22లోపు పూర్తి అవుతుంది. తుది లబ్ధిదారుల జాబితాను సెప్టెంబర్ 24న జీఎస్‌డబ్ల్యూఎస్ విభాగం రవాణా శాఖకు పంపనుంది.
అర్హత ప్రమాణాల పరంగా చూస్తే, ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. లైసెన్స్ ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేయబడినదే కావాలి. ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. వాహనాలకు బకాయిలు లేకుండా, పెండింగ్ చలాన్లు లేకుండా ఉండాలి. అలాగే దరఖాస్తుదారు బీపీఎల్ (దారిద్ర్య రేఖ కింద) కుటుంబానికి చెందినవారై ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని స్పష్టం చేశారు. కానీ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు. భూమి పరిమితి కూడా స్పష్టంగా నిర్ణయించారు— మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించిన నిర్మాణం ఉండరాదు.
ఈ ఆర్థిక సాయం ఆటో డ్రైవర్లకు విశేషమైన ఉపశమనం కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన రిపేర్ల ఖర్చులు, ఇతర జీవన వ్యయాలను భరించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఈ సాయం మరింత ఉపయుక్తంగా మారనుంది. వాహన మిత్ర పథకం కింద నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం వల్ల పారదర్శకతతో పాటు అవినీతికి అవకాశం ఉండదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక బహుమతి పెద్ద ఊరటగా నిలవనుంది.