ప్రస్తుత కాలంలో బిజీ జీవనశైలి కారణంగా చాలామంది ఇంట్లో వంట చేసుకుని తినే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఉద్యోగాల టైమింగ్స్, పనుల ఒత్తిడి కారణంగా బయట ఆహారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు, తోపుడు బండ్లు ఎక్కడ చూసినా రద్దీగా ఉంటున్నాయి. రంగురంగులుగా, రుచిగా కనిపించే వంటకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఆహారంలో కల్తీ పదార్థాలు అధికంగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు పడుతున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక ఘటన ఈ సమస్యను స్పష్టంగా చూపించింది. 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పానీపూరీ తిన్న తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. ఒక నెల రోజుల పాటు అతడు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, బయట ఆహారం ఎంత ప్రమాదకరమో అందరినీ ఆలోచింపజేసింది.
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ యువకుడు కళ్లూ, చర్మం పసుపు రంగులోకి మారడం, కడుపులో నొప్పి, వాంతులు, నీరసం వంటి లక్షణాలతో వచ్చాడు. అతని మూత్రం ముదురు రంగులో కనిపించింది. రక్తపరీక్షలలో హెపటైటిస్-ఎ వైరస్ ఉన్నట్లు తేలింది. కాలేయ ఎంజైమ్స్ స్థాయులు పెరగడంతో పరిస్థితి తీవ్రమైంది. యాంటీ-హెచ్‌ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్‌గా రావడంతో స్పష్టత వచ్చింది.
సమయానికి వైద్యుల జోక్యం వహించడం వల్ల ఆ యువకుడి ప్రాణాలు రక్షించబడ్డాయి. నాలుగు వారాల పాటు ప్రత్యేక చికిత్స చేయడంతో లివర్ పరిస్థితి మెరుగై పూర్తిగా కోలుకున్నాడు. వైద్యులు హెచ్చరిస్తూ, బయట ఆహారం తీసుకోవడం వల్ల ఇలా తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు.
ఈ సంఘటన ప్రజలకు ఒక హెచ్చరిక లాంటిది. తాత్కాలిక రుచికోసం తీసుకునే కల్తీ ఆహారం దీర్ఘకాలంలో ప్రాణాలకు ప్రమాదమవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. బయట తినే సందర్భాల్లో ఆహారం నాణ్యతపై జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది.