విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ డయాస్పొరా (ప్రవాసుల) కు, వారి కుటుంబాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, భారత రాయబార కార్యాలయాలకు 'ప్రవాసీ ప్రజావాణి' ఒక బలమైన వారధిగా, అనుసంధాకర్తగా పనిచేస్తున్నదని, సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, సీనియర్ ఐఏఎస్ దివ్యా దేవరాజన్ అన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 16న జీఓ జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ప్రథమ వార్షికోత్సవం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, లండన్ ఎన్నారై రంగుల సుధాకర్ గౌడ్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, గల్ఫ్ సినిమా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.