అక్రమ బెట్టింగ్ యాప్ 1xBetపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు తాజాగా మరోసారి పెద్ద అడుగు వేశారు. మాజీ భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో వీరిని విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు సమాచారం.
1xBet యాప్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించిన ప్రముఖులు తీసుకున్న పారితోషికం, ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీయనున్నారు. ఈ యాప్‌ను ప్రమోట్ చేసినందువల్లే భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రా, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి తమ పత్రాలను ఈడీకి సమర్పించారు. వారి తరఫు న్యాయవాది ప్రకారం, సమర్పించినవి సాధారణ డాక్యుమెంట్సే తప్ప పెద్దగా ముఖ్యమైనవి కావని తెలిపారు. అయినప్పటికీ అధికారులు కాంటాక్టులు, బ్యాంకింగ్ రికార్డులు, ఆర్థిక ట్రాన్సాక్షన్లను శోధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు కొత్తది కాదు. ఇప్పటికే గతంలో కూడా ప్రముఖ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. వారికి సంబంధించిన ఒప్పందాలు, డబ్బు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపారు. ఇప్పుడు మరోసారి యువరాజ్, ఉతప్ప, సోనూ సూద్ వంటి ప్రముఖుల పేర్లు బయటకు రావడం కేసును మరింత హాట్‌టాపిక్‌గా మార్చింది.
సైప్రస్ కేంద్రంగా పనిచేస్తున్న 1xBet యాప్‌పై ఇప్పటికే యూకే, అమెరికా, రష్యా, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆర్థిక అవకతవకల కారణంగా నిషేధం విధించాయి. గతేడాది సంచలనం సృష్టించిన మహాదేవ్ సట్టా యాప్ కుంభకోణం తరహాలోనే ఈ కేసులో కూడా సెలబ్రిటీల ప్రమేయం బయటపడడం గమనార్హం. భారత్‌లో ఈడీ ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణించి, బెట్టింగ్ యాప్ వెనుక ఉన్న ఆర్థిక జాలాన్ని బయటపెట్టే దిశగా దర్యాప్తును ముమ్మరం చేస్తోంది.