2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పాలన కొనసాగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. నాటి వైసీపీ పాలన బ్రిటీష్ రాజ్యం మాదిరిగానే సాగిందని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలమే మన స్వాతంత్ర్యం అని అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు శాంతి భద్రతలు కీలకమని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల్లో ఓటమి పాలైతే ఓటు చోరీ ఆరోపణలు చేయడం, గెలిచినప్పుడు మౌనం వహించడం ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. “ఓడితే ఓటు చోరీ అంటారా? గెలిస్తే న్యాయం, ఓడితే అన్యాయమా?” అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో గొంతెత్తిన వారిపై దాడులు జరిగేవని, అవినీతి పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.