ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రయాణానికి ముందు ఆయా దేశాల నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సింగపూర్ లాంటి దేశానికి వెళ్లేటప్పుడు వారి కఠినమైన చట్టాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
మీరు మీ దేశంలో సాధారణంగా తీసుకువెళ్లే కొన్ని వస్తువులు సింగపూర్‌లో మీకు ఇబ్బందులు సృష్టించవచ్చు. ఉదాహరణకు, ఒక ప్యాకెట్ చూయింగ్ గమ్ లేదా పెంచుకునే గోల్డ్ ఫిష్ కూడా మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.
సింగపూర్ ప్రయాణానికి వెళ్తున్నవారు ఏ వస్తువులు తీసుకువెళ్లకూడదో, ఏవి తీసుకువెళ్లవచ్చో తెలుసుకోవడం చాలా అవసరం. అధికారిక మార్గదర్శకాల కోసం, నిబంధనలను తప్పకుండా తనిఖీ చేయండి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం.
సింగపూర్‌లో నిషేధిత వస్తువులు:
కాపీరైట్ వస్తువులు: మీరు విమానంలో పైరేటెడ్ సినిమాలు లేదా టీవీ షోలు చూడాలని అనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచన మానుకోండి. సింగపూర్‌లో కాపీరైట్ ఉల్లంఘనపై చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే S$100,000 వరకు జరిమానా, అలాగే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
చూయింగ్ గమ్: ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. సింగపూర్ 1992 నుంచి చూయింగ్ గమ్‌ను నిషేధించింది. చెత్త, విధ్వంసాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూయింగ్ గమ్‌ను దిగుమతి చేయడం, అమ్మడం లేదా కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి S$100,000 వరకు జరిమానా, లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా గమ్‌ను తీసుకువెళ్లకూడదు.
నికోటిన్, పొగాకు: సింగపూర్‌లో పొగతాగడం చట్టబద్ధమే, కానీ చాలావరకు నిరుత్సాహపరుస్తారు. చాలా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లను నిషేధించారు. సింగపూర్ ఆగ్నేయాసియాలో అత్యంత తక్కువ పొగాకు వినియోగాన్ని నమోదు చేసింది. ప్రయాణికులు పొగాకు తీసుకువెళ్లేటప్పుడు విధిగా రెడ్ ఛానెల్‌లో తమ దగ్గర ఉన్న పొగాకును డిక్లేర్ చేయాలి, అంతేకాకుండా దానిపై డ్యూటీ, జీఎస్‌టీ చెల్లించాలి.
ఇతర ముఖ్యమైన నిబంధనలు:
పెంపుడు జంతువులు (సజీవంగా): మీరు పెంపుడు గోల్డ్ ఫిష్ లేదా పక్షులను సింగపూర్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటే, ముందుగానే అనేక లైసెన్సులు, అనుమతులు తీసుకోవడం అవసరం. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి.
మందులు: మీరు తీసుకువెళ్లే కొన్ని వ్యక్తిగత మందులలో కొన్ని పదార్థాలు నిషేధించబడినవిగా ఉండవచ్చు. అందుకే ప్యాక్ చేసే ముందు వాటిని సరి చూసుకోవడం మంచిది. ముఖ్యంగా, మీరు మూడు నెలలకు పైగా సరిపడా మందులను తీసుకువెళ్లాలని అనుకుంటే, ముందుగా అనుమతి తీసుకోవాలి.
ఈ నిబంధనలు కొంచెం కఠినంగా అనిపించినా, సింగపూర్ పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రయాణానికి ముందు ఈ విషయాలను తెలుసుకుంటే, మీ ట్రిప్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతుంది.