పురాతన కాలం నుంచి మన తాతముత్తాతలు, అమ్మమ్మలు వాడిన అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క నల్లేరు. కానీ ఇప్పుడు దాని గొప్పదనం, ఆయుర్వేద గుణాలను నేటి సమాజం తెలుసుకోలేకపోతుంది. నల్లేరు గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు, ఉపయోగాలు, వాటిని ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం.


ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే ఆహారం తీసుకునే దానికంటే, మన పెరటిలో లేదా మన అడవిలో నల్లేరు పుష్కలంగా లభిస్తుంది. ఈ నల్లేరులో ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి మనకు అందించే గొప్ప వరాలలో నల్లేరు కూడా ఒకటి.


నల్లేరు, దీనిని హడ్జోడ్ అని కూడా పిలుస్తారు. ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన ఒక మొక్క. ఇది తీగలాగా చుట్టుకుంటూ పెరుగుతుంది. నల్లేరు కాండం నాలుగు కోణాలతో చదరంగా ఉంటుంది. దీనికి చిన్న ఆకులు, తెలుపు రంగు పువ్వులు పూస్తాయి. ఈ మొక్క భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా మరియు అరేబియా ద్వీపకల్పంలో ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల ప్రజలు నల్లేరును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.


నల్లేరులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్లేరులో ఉండే కాల్షియం ఎముకలను మరింత బలంగా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి నల్లేరు బాగా ఉపయోగపడుతుంది. నల్లేరును క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియ రేటు పెరిగి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా నల్లేరు సహాయపడుతుంది.

నల్లేరును ఎండబెట్టి పొడిగా చేసి, ఆ పొడిని పాలలో కానీ లేదా తేనెలో కానీ కలిపి తాగడం ద్వారా కాళ్ల వాపులు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లేదా నల్లేరు ఆకులు, లేత కాండాలను శుభ్రం చేసి, కారం, ఉప్పు, చింతపండు, వెల్లుల్లితో కలిపి పచ్చడి చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

నల్లేరులో దురద స్వభావం ఉంటుంది కాబట్టి, వాడే ముందు కాండంపై ఉండే పీచుని తీసి, దానిని కొద్దిసేపు నిమ్మరసం లేదా మజ్జిగలో నానబెట్టడం మంచిది. అలాగే, నల్లేరును మితంగా మాత్రమే తీసుకోవాలి. కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయని అతిగా తింటే కడుపులో మంట, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ఉత్తమం.