భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులపై ఇటీవల ఒక అద్భుతమైన డిజిటల్ కుట్ర చోటుచేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి తెచ్చాయి. సాధారణంగా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు రూ.37,000 ఉండేది. అయితే గత శనివారం నాటికి ఒక్కసారిగా ధరలు రూ.80,000 దాటాయి. ఈ అకస్మాత్తు పెరుగుదల వెనుక "మాగా" (Make America Great Again – ట్రంప్ మద్దతుదారుల బృందం) మరియు ప్రముఖ ఆన్‌లైన్ ఫోరమ్ "4చాన్" చేతులు కలిపి నిర్వహించిన భారీ ఆపరేషన్ ఉందని తెలుస్తోంది. "క్లాగ్ ది టాయిలెట్" పేరుతో వారు ఈ ఆపరేషన్ చేపట్టారు. దీని లక్ష్యం స్పష్టంగా హెచ్-1బీ వీసాదారులు, ముఖ్యంగా భారతీయులు, అమెరికాకు చేరకుండా అడ్డుకోవడమే.
ఈ కుట్రకు సంబంధించి 4చాన్ ఫోరమ్‌లో యూజర్లు పిలుపునిచ్చిన పోస్టులు బయటపడ్డాయి. "హెచ్-1బీ వీసా గురించి భారతీయులకు ఇప్పుడే తెలిసింది. వాళ్లను అక్కడే ఆపాలనుకుంటున్నారా? ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్‌ను బ్లాక్ చేయండి. సీట్లు ఎంచుకొని 15 నిమిషాలు డబ్బు చెల్లించకుండా హోల్డ్‌లో పెట్టండి. అదే ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయండి" అని ఒక పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పిలుపుతో వందలాది మంది యూజర్లు ఏకకాలంలో ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లలోకి లాగిన్ అయ్యి, సీట్లను బ్లాక్ చేశారు. కొంతమంది తాము ఏకంగా 100 సీట్లు కూడా హోల్డ్‌లో పెట్టినట్లు పొగడ్తలు చెప్పుకున్నారు.
ఈ చర్యల వల్ల ఎయిర్‌లైన్ సిస్టమ్స్‌లో కృత్రిమ డిమాండ్ సృష్టించబడింది. సాధారణంగా అల్గారిథమ్ ఆధారంగా పనిచేసే రిజర్వేషన్ వ్యవస్థలు అధిక డిమాండ్ ఉందని భావించి ఆటోమేటిక్‌గా ధరలను పెంచేస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజంగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారికీ, ముఖ్యంగా ఉద్యోగ, చదువు లేదా అత్యవసర పనులతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయులకీ ఇది పెద్ద సమస్యగా మారింది. టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే భారీ ధరలు చూపించడంతో వారు గందరగోళానికి గురయ్యారు. చాలా మంది అధిక ధర చెల్లించలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇది ఏకంగా ఒక డిజిటల్ దాడిలా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుపై ప్రకటన చేసిన వెంటనే ఈ సంఘటనలు జరగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. "మాగా" బృందం ట్రంప్ నిర్ణయాలకు మద్దతుగా, భారతీయ వీసా హోల్డర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా ఈ కుట్ర నడిపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయాణికుల సమస్యలు, ఎయిర్‌లైన్ కంపెనీలపై ఒత్తిడి, ఆన్‌లైన్ సిస్టమ్స్ లోపాలు— మొత్తం కలిసి ఒక కొత్త రకమైన ముప్పుగా మారాయి. ఇది కేవలం ఒక దేశ ప్రజలకే కాక, అంతర్జాతీయ విమానయాన రంగానికే ఒక హెచ్చరిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.