విజయవాడలో దసరా వేళ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. భక్తులు, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్గదర్శకాలు పెట్టామని ఆయన తెలపడం జరిగినది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు నల్లగుంట వద్ద నుంచి వెస్ట్ బైపాస్ ఎక్కి చిన్న అవుటపల్లి, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లేవారు కూడా నల్లగుంట దగ్గర నుంచి బైపాస్ ఎక్కి, చిన్న అవుటపల్లి, కేశరపల్లి మీదుగా వెళ్లాలని చెప్పారు. ఇక గుంటూరు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి మీదుగా రాకపోకలు సాగించాలన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఒంగోలు, చీరాల, బాపట్ల, గుడివాడ మార్గం ఎంచుకోవాలని తెలిపారు.
నగరానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలు కూడా కేటాయించామని పోలీసులు తెలిపారు. భవానీపురం వైపు నుంచి వచ్చే వారు టిటిడి పార్కింగ్, ఎండి రావు ఖాళీ స్థలం, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, గోళ్లపూడి మార్కెట్ యార్డ్, లారీ స్టాండ్, సోమా గ్రౌండ్ లాంటి ప్రదేశాల్లో వాహనాలు నిలిపేయాలని చెప్పారు. గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వారు బీఆర్టీఎస్ రోడ్లు, సంగీత కళాశాల మైదానం, జింఖానా మైదానంలో వాహనాలు పార్క్ చేసుకోవచ్చని తెలిపారు.
దసరా రోజుల్లో భక్తుల రాకపోకలు భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ ఈ మార్గదర్శకాలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.