గంగోత్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్, ఆ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. గతంలో కూడా అల్లు అర్జున్ ఏది చేసినా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారేది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'ఉత్తమ నటుడు'గా అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
పుష్ప చిత్రం అల్లు అర్జున్ సినీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ సినిమాతో అటు సౌత్ ఇండియా లోనే కాకుండా, నార్త్ ఇండియా కూడా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్ క్రియేటివ్ కంటెంట్ ఆఫీసర్ అయిన బేలా బజారియా, అల్లు అర్జున్, నాని, అల్లు అరవింద్, మరియు నాగవంశీతో కలిసి ఒక సమావేశం నిర్వహించిన ఫొటోలు 'ఎక్స్' లో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశంలో అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న AA22xA6 సినిమా OTT హక్కుల గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి, కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అలాగే, అల్లు అర్జున్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటించనున్నారు. వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రానికి 'రావణం' అనే పేరును తాత్కాలికంగా పెట్టారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది భారీ అంచనాలతో రూపొందనుంది. ఇటీవల తన నాయనమ్మ మరణం తర్వాత అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే.