ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పట్టణంలో చోటుచేసుకున్న ఓ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. ఉద్యోగాల కారణంగా తమ 15 నెలల పాపను స్థానికంగా ఉన్న డే కేర్ సెంటర్‌లో వదిలి వెళ్ళే దంపతులు, ఇటీవల పాపను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆమె శరీరంపై అనుమానాస్పద గాయాలు, కొరికిన గుర్తులు గమనించారు.
పాప పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే డే కేర్ సెంటర్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో ఆయాగా పని చేసే యువతి పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా, నేలకేసి పడేసి, గోడకు కొట్టడం, ప్లాస్టిక్ బ్యాట్‌తో దాడి చేయడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
బాధితుల మాట ప్రకారం, ఈ ఘటన గురించి యాజమాన్యం ముందుగానే తెలుసుకున్నప్పటికీ, చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. అంతేకాక, తమను ప్రశ్నించగా దుర్భాషలాడారని తెలిపారు.
సీసీటీవీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, సెంటర్‌లో పనిచేసే ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ అవుతోంది. డే కేర్ సెంటర్‌లలో పిల్లలపై అమానుషంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.