రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో ఈ కొత్త భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మించారు. అక్టోబర్ 30న ఈ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.
ఈ డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని 11 డిపోల సిబ్బంది, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది కలిపి దాదాపు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. కొత్త భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ సౌకర్యవంతమైన వాతావరణంలో ఆరోగ్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య సదుపాయాల విస్తరణతో పాటు సేవల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
తిరుపతిలోని అలిపిరి డిపో సమీపంలో 1.3 ఎకరాల విస్తీర్ణంలో రూ.3.89 కోట్ల వ్యయంతో ఈ జీ+3 అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించారు. భవనంలో పార్కింగ్ స్థలం, లిఫ్ట్ సదుపాయం, విశాలమైన వెయిటింగ్ హాల్, ఫార్మసీ, వైద్యుల కోసం ప్రత్యేక గదులు, ఓపీ కేంద్రం వంటి ఆధునిక వసతులు కల్పించారు. వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు, రెండో, మూడో అంతస్తుల్లో ఉద్యోగులు, వైద్య సిబ్బంది కోసం గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా కల్పించారు.
ప్రస్తుతం డిస్పెన్సరీలో రోజుకు సుమారు 100 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈసీజీతో పాటు సెమీ ఆటోమేటిక్ ఎనలైజర్ ద్వారా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు రూ.3 లక్షల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సేవలు ఇప్పుడు కొత్త భవనంలో మరింత విస్తృతంగా కొనసాగనున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణతో పాటు, భవిష్యత్‌లో వారి ప్రమోషన్ల అంశంపైనా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం. ఈ డిస్పెన్సరీ ప్రారంభం ద్వారా ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య భద్రతా పరిరక్షణలో మరో అడుగు ముందుకేసినట్టయింది.