ఇక ఆధార్ కార్డులో మార్పులు చేయడం కోసం గంటల తరబడి ఆధార్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. నవంబర్ 1 నుంచి యూఐడీఏఐ (UIDAI) ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయనుంది. ఈ కొత్త మార్పులతో పౌరులు ఇంట్లో కూర్చునే ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇకపై ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఆధార్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
యూఐడీఏఐ ఈ నిర్ణయాన్ని పౌరుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంది. ఇప్పటి వరకు చిరునామా మార్పు లేదా చిన్న మార్పులకూ ఆధార్ కేంద్రాలకు వెళ్లి టోకెన్ తీసుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మరో రోజు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఇక ఈ ఇబ్బందులకు ముగింపు పలుకుతూ నవంబర్ 1 నుంచి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు. ఈ మార్పుతో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతుందని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.
అయితే బయోమెట్రిక్ వివరాలు — అంటే ఫింగర్‌ప్రింట్లు, ఐరిస్ స్కాన్ — మార్చుకోవాలంటే మాత్రం ఆధార్ సేవా కేంద్రాన్నే సందర్శించాల్సి ఉంటుంది. వీటిని భద్రత కారణాల దృష్ట్యా ఆన్‌లైన్‌లో మార్పు చేసే అవకాశాన్ని ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేశారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితంగా చేయవచ్చని చెప్పారు. ఇక పేరు, చిరునామా వంటి సాధారణ వివరాల మార్పులకు రూ.75, బయోమెట్రిక్ అప్‌డేట్స్‌కు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే చెల్లించే అవకాశం కూడా కల్పించారు.
డిజిటల్ మార్పిడి దిశగా ఇది మరో పెద్ద ముందడుగని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ వివరాల్లో పొరపాట్లను సరిదిద్దడం మరింత సులభతరం అవుతుందని, దీనివల్ల పౌరుల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పౌరులు ఆధార్ సేవలను మరింత వేగంగా వినియోగించుకోవడానికి ఈ ఆన్‌లైన్ సదుపాయం పెద్దగా ఉపయోగపడనుంది. నవంబర్ 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.