ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. మొత్తం 1,42,765 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.71.38 కోట్ల పెట్టుబడి సాయం జమైంది.
ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పంపిణీ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు, అలాగే ఎన్‌పీసీఐలో ఖాతా వివరాలు సరిగా లేని వారిలో 38,658 మంది సమస్యలు సరిచేసుకుని డబ్బులు పొందారు.
గతంలో పీఎం కిసాన్ కింద రూ.2 వేల రూపాయలు జమ కాగా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద అదనంగా రూ.5 వేల రూపాయలు చొప్పున రైతులకు చేరాయి. మొత్తంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల రూపాయలు జమ అయినట్లు అధికారులు తెలిపారు.
రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేసి కాప్చా ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ వివరాలు తెలుస్తాయి.
వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, ఇంకా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాని ఖాతాదారులు కూడా త్వరగా సమస్యలు సరిచేసుకోవాలని సూచించారు.