ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. 2025-26 సీజన్ కోసం పత్తి కొనుగోలు మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మద్దతు ధర (MSP) కింద సీసీఐ (CCI) ద్వారా పత్తి కొనుగోలు చేయనుంది. పొడవు పింజ పత్తి క్వింటా ధరను రూ.8,110గా, మధ్యస్థ పింజ పత్తి క్వింటా ధరను రూ.7,710గా నిర్ణయించారు. రైతులు ఈసారి తమ పత్తి పంటను సరైన ధరకు అమ్ముకునే అవకాశం పొందనున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. దీని ద్వారా 7.12 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చే నెల నుంచి సీఎం యాప్ ద్వారా రైతులు తమ పత్తిని అమ్మడానికి నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ కూడా చేయవచ్చు. దీని వల్ల రైతులకు సమయాన్ని కేటాయించుకోవడం సులభం అవుతుంది.
పత్తి కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామ స్థాయి వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులను గుర్తించి, రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. అలాగే, కాపాస్ కిసాన్ యాప్‌లో డేటాను నమోదు చేసి, రైతులకు మద్దతు ధర అందేలా చూస్తారు. పత్తి నిల్వలు ఉండే యార్డులు, మిల్లుల్లో బీమా సదుపాయం కూడా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
రైతులు పత్తి తీసుకురావడానికి ప్లాస్టిక్, గన్నీ సంచులు వాడకుండా, లూజ్ పత్తిని మాత్రమే తెచ్చాలని సూచించారు. అమ్మకం కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం వంటి పత్రాలు తీసుకురావాలి. పత్తి డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ విధానం వల్ల రైతులకు పారదర్శకంగా మరియు వేగంగా చెల్లింపులు జరుగుతాయి.
అదే విధంగా పత్తి నాణ్యతను నిర్ధారించడానికి మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక పరికరాలు, ఎలక్ట్రానిక్ తూనికలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. పత్తి రవాణా వివరాలు కూడా యాప్‌లో నమోదు చేయనున్నారు. పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొత్తానికి, ఈ కొత్త చర్యలతో పత్తి రైతులకు న్యాయమైన ధర లభించి, ఇబ్బందులు లేకుండా అమ్మకాలు జరగనున్నాయి.