5 ఏళ్లు దాటినా ఆధార్ అప్ డేషన్ (Aadhaar update) చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా 7
కోట్లమందికి పైగా ఉన్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. వారి కోసం పాఠశాలలోనే దశలవారీగా బయోమెట్రిక్ అప్డేట్ (Biometric update) చేసే విధంగా ఉడాయ్ ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆధార్ కస్టోడియన్ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపించి.. ప్రతి పాఠశాలలో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ (CEO Bhuvanesh Kumar) తెలిపారు. "పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు సమ్మతితో పాఠశాలల ద్వారా చేపట్టేందుకు మేం ప్రాజెక్టును రూపొందిస్తున్నాం.
ప్రస్తుతానికి దీనికి కావాల్సిన సాంకేతికతను పరీక్షిస్తున్నాం. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుంది” అని ఆయన తెలిపారు. 15 ఏళ్లు పూర్తయిన పిల్లలకు రెండో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్(MBU) కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు (School), కాలేజీల (Colleges) ద్వారా అమలు చేయాలని చూస్తున్నట్లు భువనేశ్ కుమార్ అన్నారు.
"అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకం. ప్రతి చిన్నారికీ అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఆధార్ తప్పనిసరి. అందుకే పాఠశాలల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నాం” అని ఆయన తెలిపారు.
ఎంబీయూని సమయానికి పూర్తిచేయకపోతే ఆధార్ డేటాలో తప్పిదాలు రావచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 7 ఏళ్ల వయసు తర్వాత కూడా ఎంబీయూ పూర్తి చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ (Aadhaar Deactivate) అయ్యే అవకాశం ఉంది.
5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు అప్షన్కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఉడాయ్ పేర్కొంది. ఏడేళ్లు దాటితే మాత్రం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. స్కూల్ అడ్మిషన్ (School Admission), నగదు బదిలీ పథకాలు, స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్గా ఉండడం ముఖ్యమని తెలిపింది.