ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లో కూటమి ప్రభుత్వం ఒక్కొ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ప్రభుత్వ (Government), ప్రైవేట్ (Private), ఎయిడెడ్ (Aided) పాఠశాలల్లో చదువుతున్న 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులు, ఇంటర్ (Intermediate) మొదటి మరియు రెండవ సంవత్సరాల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)కు చెందిన (ఎస్సీ) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో "తల్లికి వందనం (Thalliki Vandanam)" పథకం కింద నిధులు జమ చేసింది.
ఈ పథకం ద్వారా మొత్తం 3.93 లక్షల మంది విద్యార్థులకు 40% వాటా ఆధారంగా రూ.382.66 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. డే స్కాలర్ ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.10,900, హాస్టల్ విద్యార్థుల తల్లులకు రూ.8,800 చొప్పున జమ చేశారు. అలాగే ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు, ర్యాంకు ఆధారంగా రూ.5,200 నుంచి రూ.10,972 వరకూ నగదు అందించారు.
ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన "సూపర్ సిక్స్ (Super Six)" హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని, ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అమలుకు తెచ్చింది. ఈ పథకం కింద మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.10,091 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే అందులో రూ.2 వేల భాగం జిల్లా కలెక్టర్ల (Collectors) ఆధ్వర్యంలోని ఖాతాకు మళ్లించి పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు.
ఈ నిధులు ఆయా కార్పొరేషన్ల (Corporations) ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు బలమైన ఆర్థిక మద్దతుతోపాటు తల్లులకు గౌరవం కలుగజేస్తున్న విధానంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తోంది.