అమెరికా పౌరసత్వం పొందదలచిన వారికి ఇది కీలక పరిణామం. ఇకపై పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే వారికి కేవలం నేర చరిత్ర లేకపోవడం సరిపోదు. వారి మొత్తం ప్రవర్తన, సమాజంలో జీవనశైలి, బాధ్యతాయుతమైన సభ్యుడిగా వ్యవహరిస్తున్నారా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు అమెరికా వలసల వ్యవస్థను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజా పాలసీ మెమోరాండం విడుదల చేసింది.
యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది: పౌరసత్వం అనేది కేవలం అమెరికాలో నివసించే, పనిచేసే హక్కు మాత్రమే కాదు.. అది సమాజంలో చురుకైన, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉండే అర్హత. ఇకపై దరఖాస్తుదారులపై "సంపూర్ణ మదింపు" (Totality of Circumstances) విధానాన్ని అనుసరించనున్నారు. అంటే సానుకూల, ప్రతికూల అంశాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, స్థిరమైన ఉద్యోగం, పన్నులు చెల్లించడం, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం, స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వంటి అంశాలు సానుకూలంగా పరిగణిస్తారు.
అదే సమయంలో హత్య, తీవ్రమైన నేరాలు, హింస, మత స్వేచ్ఛను ఉల్లంఘించడం వంటి అంశాలు పౌరసత్వంపై శాశ్వత నిషేధానికి దారితీస్తాయి. పదే పదే మద్యం సేవించి వాహనం నడపడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, చట్టవిరుద్ధంగా ఓటు వేయడం వంటి అంశాలు షరతులతో కూడిన అనర్హతలుగా పరిగణిస్తారు.
అయితే పిల్లల పోషణ బకాయిలు చెల్లించడం, పన్నులు క్లియర్ చేయడం, లేదా ప్రవర్తనలో మార్పు చేర్పులు వచ్చినట్లు సమాజంలో విశ్వసనీయులైన వ్యక్తుల నుంచి సాక్ష్యం చూపించడం వంటివి పునరావాస సూచనలుగా పరిగణిస్తారు. సాధారణంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లు మూడు లేదా ఐదు సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తారు. ఇందులో ఇంగ్లీష్, సివిక్స్ పరీక్షలతో పాటు ఇప్పుడు "మంచి నైతిక ప్రవర్తన" నిరూపణ కూడా కీలక ప్రమాణంగా మారింది.