ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జీఎంఆర్‌కు ఆదేశించగా, ఇప్పటికే పనులు ఊపందుకున్నాయి. గత ప్రభుత్వ కాలంలో కేవలం 31.80% పనులే జరిగి ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులై చివరి నాటికి 84% పనులు పూర్తి అయ్యాయి.
విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 45 నిమిషాల్లో చేరుకునేలా బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రూ.2,800 కోట్ల వ్యయంతో భూసేకరణ, రహదారి విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారిడార్‌లో గోస్తనీ నది మీద బ్రిడ్జి నిర్మాణం కూడా ఉంటుంది. అదనంగా, విమానాశ్రయానికి అనుబంధంగా 15 అంతర్గత రహదారులను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది. వీటికి రూ.390 కోట్లు కేటాయించగా, కనీసం 7 రహదారులు 2026 జూన్ నాటికి పూర్తయ్యేలా లక్ష్యాలు పెట్టుకుంది.
విశాఖలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం 4 ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. అగనంపూడి-లంకెలపాలెం, స్టీల్ ప్లాంట్-బీహెచ్‌ఈఎల్, సత్యం జంక్షన్-హనుమంతువాక, మధురవాడ క్రీడామైదానం-కొమ్మాది మార్గాల్లో ఈ కారిడార్లు నిర్మించనున్నారు. ఇవి పూర్తవుతున్నా ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒక విమానంతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మొత్తం మీద అన్నీ అనుకున్నట్లే సాగితే, వచ్చే ఏడాది జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు ఎగరడం ప్రారంభం కానుంది.