కడప జిల్లాకు చెందిన ఒక యువకుడు తనతో పాటు మయన్మార్‌లో ఇరుక్కుపోయిన పలువురు తెలుగు యువకుల దుస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, మొదట థాయిలాండ్‌కు పిలిపించుకుని, ఆ తర్వాత మయన్మార్‌కు తరలించారని ఆయన వివరించాడు. అక్కడ ముఠాలు వారిని సైబర్ నేరాలకు బలవంతం చేస్తూ, విఫలమైతే చిత్రహింసలు పెడుతున్నాయని చెబుతున్నారు. ఈ ముఠాలు యువకులపై భయానకంగా దాడులు చేసి, కొట్టిపారేస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం వెళ్లి, మోసపోయి ఇప్పుడు ప్రాణాలకు కూడా భయపడుతున్నారని సమాచారం.
అక్కడి ముఠాలు సైబర్ మోసాలకు పాల్పడాలని బలవంతం చేస్తూ, ఎవరైనా నిరాకరిస్తే తిండి పెట్టకపోవడం, కొట్టడం, విద్యుత్ షాక్‌లు ఇవ్వడం వంటి హింసాత్మక చర్యలకు దిగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యువకులు తప్పించుకునే మార్గం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కడప యువకుడు పోస్ట్ చేసిన వీడియోలో తనతో పాటు మరికొందరిని కూడా రక్షించమని వేడుకున్నాడు. ఈ విషయంపై అధికార యంత్రాంగం స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబాలు కోరుతున్నారు. ప్రస్తుతం మయన్మార్‌లో తెలుగు యువకుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారి, పరిస్థితి ఎటు తిరుగుతుందో అర్ధం కావడం లేదు.