పోడు భూముల అంశం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇచ్చోడ మండలంలోని కేశవ్ పట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు, అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లదాడికి దిగారు. దాడిలో తొమ్మిది మంది పోలీసులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇవివరాల్లోకి వెళితే, సిరిచెల్మ రేంజ్ పరిధిలోని కేశవ్‌పట్నం అటవీ ప్రాంతంలోని 172, 174 కంపార్ట్‌మెంట్ లలో అధికారులు గత నాలుగు రోజులుగా మొక్కలు నాటుతున్నారు. అయితే, ముల్తానీ గ్రామస్తులు ఈ మొక్కలను తొలగిస్తూ వచ్చారు. అధికారుల భద్రత కోసం పోలీసులు కూడా వెంట ఉన్నారు.
అటవీ భూముల్లోకి ప్రవేశించరాదని అధికారుల హెచ్చరికను గ్రామస్తులు ఖండించారు. ఆ భూములు తమకు చెందినవని పేర్కొంటూ కొందరు మహిళా రైతులు, పత్రాలు చూపించాలని అడిగిన అధికారులకు, "మా భూములపై హక్కు చెలాయిస్తే, ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం" అని హెచ్చరించారు.
పరిస్థితిని సమీక్షించిన అనంతరం అధికారులు వెనుదిరిగినా, మరుసటి రోజు మళ్లీ గ్రామంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్షిస్తున్నారు.