భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం మరోసారి తన శక్తిని చాటింది. దేశీయంగా నిర్మించిన రెండు అత్యాధునిక నీలగిరి-క్లాస్ స్టెల్త్ యుద్ధనౌకలు ‘ఐఎన్ఎస్ హిమగిరి’, ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ మంగళవారం భారత నౌకాదళంలోకి చేరాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాన అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో రెండు యుద్ధనౌకలను లాంఛనంగా నౌకాదళానికి అప్పగించారు.
ఒకే రోజున రెండు ప్రధాన యుద్ధనౌకల జలప్రవేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్ట్ 17 ఆల్ఫా (పీ-17ఏ)లో భాగంగా వీటిని నిర్మించారు. వీటిలో 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతను వినియోగించడం ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) ఐఎన్ఎస్ హిమగిరిని నిర్మించగా, ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (ఎండీఎల్) ఐఎన్ఎస్ ఉదయగిరిని తయారు చేసింది. ఈ రెండు యుద్ధనౌకలు తూర్పు నౌకాదళంలో సేవలు అందించనున్నాయి. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని, వారి ‘ముత్యాల హారం’ వ్యూహాన్ని అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నౌకల బరువు సుమారు 6,700 టన్నులు, పొడవు 149 మీటర్లు. గంటకు 28 నాట్ల వేగంతో (సుమారు 52 కిలోమీటర్లు) ప్రయాణించగల సామర్థ్యం వీటికి ఉంది. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ వాడటం వల్ల శత్రువుల రాడార్లకు వీటిని గుర్తించడం కష్టమవుతుంది.
బరాక్-8, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, 76 ఎంఎం గన్‌లతో వీటిని మరింత శక్తివంతం చేశారు. అంతేకాకుండా, టార్పెడోలను ఎదుర్కొనే మారీచ్ సిస్టమ్‌ను కూడా మోహరించారు. రెండు హెలికాప్టర్లను ఆపరేట్ చేసే సామర్థ్యం కూడా వీటికి ఉంది. ఈ నౌకల చేరికతో భారత నౌకాదళ శక్తి మరింత పెరిగింది.