నటి రష్మికా మందన్న తన తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారింది. “పురుషులు కనీసం ఒకసారి అయినా మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనుభవిస్తే మహిళలు ప్రతి నెల ఎదుర్కొనే శారీరక వేదనను అర్థం చేసుకోగలుగుతారు” అని ఆమె ఒక టాక్ షోలో చెప్పిన మాటలు వైరల్ కావడంతో విభిన్న ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వచ్చిన ట్రోలింగ్‌కు రష్మికా స్వయంగా స్పందించడం మరింత చర్చను రేపింది.
జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరించిన కార్యక్రమం జయమ్ము నిశ్చయమ్ము రా లో రష్మికా ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళల హార్మోన్ల మార్పులు, పీరియడ్ సమయంలో కలిగే తీవ్రమైన నొప్పి గురించి ఆమె చెప్పిన వివరాలు షోలో వినిపించగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
కొంతమంది ఆమెకు మద్దతు పలుకుతూ… మహిళల శారీరక, భావోద్వేగ భారం గురించి సమాజం మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొందరు ఆమె వ్యాఖ్యలను పురుషులపై ఆరోపణగా తీసుకుని విమర్శలు కూడా చేశారు.
ఒక అభిమాని సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో రష్మికా వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్ట్ చేస్తూ ఇది పురుషుల బాధలను చిన్నబుచ్చే వ్యాఖ్య కాదు మహిళల బాధను అర్థం చేసుకోవాలనే కోరిక మాత్రమే అని రాశాడు. ఆ పోస్ట్‌కు రష్మికా స్పందిస్తూ…. నా నిజమైన ఉద్దేశ్యం ఎవరూ మాట్లాడటం లేదు. నేను ఏ అర్థంలో చెప్పినా,
దాన్ని వేరే కోణంలో తీసుకుని తప్పుగా అర్థం చేసుకోవడం నన్ను షోలకు ఇంటర్వ్యూలకు వెళ్లడానికి భయపెడుతుంది అని వ్యాఖ్యానించింది.
షోలో రష్మికా తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా వెల్లడించింది. పీరియడ్ నొప్పి కారణంగా ఒకసారి స్పృహ తప్పిందని ఎంత పరీక్షలు చేయించినా కారణం తెలియకపోయందని ఆమె తెలిపింది. ప్రతి నెలా ఈ శారీరక మానసిక ఒత్తిడి మహిళలు మాత్రమే అర్థం చేసుకోగలరని అందుకే పురుషులు ఒకసారి అయినా ఆ నొప్పిని అనుభవిస్తే వారి దృష్టిలో అవగాహన పెరుగుతుందని రష్మికా అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా రష్మికా నటించిన తాజా తెలుగు చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇటీవలే విడుదలై మంచి చర్చకు దారితీసింది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం త్వరలోనే వారి వివాహం జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగవచ్చని సమాచారం