అమెరికాలో హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్ చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసాలు దేశానికి అవసరమని, ప్రతిభావంతులను తీసుకురావడంలో ఇవి కీలకమైన సాధనమని వ్యాఖ్యానించారు. అయితే ఆయన పార్టీకి చెందిన ప్రముఖ రిపబ్లికన్ నేతలు మాత్రం పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెచ్–1బీ వీసాల వల్ల అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ఈ ప్రోగ్రామ్‌ను పూర్తిగా నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని వారు వాదిస్తున్నారు. దీంతో ఏటా వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఆధారపడే ఈ ప్రోగ్రామ్ భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్న నేత రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్. వైద్య రంగం తప్ప మిగతా అన్ని రంగాల్లో హెచ్–1బీ వీసాలను నిషేధించాలని ఆమె స్పష్టం చేశారు. దీనికోసం ఆమె త్వరలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుత వీసాల లిమిట్‌ను 85,000 నుంచి కేవలం 10,000కు తగ్గించాలన్న ఆమె ప్రతిపాదన భారతీయ వలస నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాక, హెచ్–1బీ ద్వారా వచ్చినవారు శాశ్వతంగా అమెరికాలో ఉండకుండా తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలన్న గ్రీన్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. మరో రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ కూడా ఈ డిమాండ్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు.
అయితే, ట్రంప్ అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులను తెచ్చుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్ కూడా దీనిపై స్పందిస్తూ... హెచ్–1బీ వీసా వ్యవస్థలో ఉన్న దుర్వినియోగాలను అరికట్టడంపైనే దృష్టి పెట్టామని, కానీ ఈ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రిపబ్లికన్ పార్టీ అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి.
ఇక ఆర్థిక నిపుణులు, విధాన పరిశోధకులు హెచ్–1బీ వీసాలను రద్దు చేయడం అమెరికాకు తీవ్ర నష్టమేనని హెచ్చరిస్తున్నారు. మాన్‌హట్టన్ ఇన్‌స్టిట్యూట్ తాజా అధ్యయనం ప్రకారం, హెచ్–1బీ వీసాదారులు అమెరికన్ జీడీపీకి గణనీయమైన మేరకు దోహదపడుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత విలువైన వర్గమని వారు పేర్కొన్నారు. 2024లో జారీ చేసిన మొత్తం హెచ్–1బీ వీసాలలో 70% కంటే వెళ్ళడం, ఈ వర్గం అమెరికన్ టెక్ రంగానికి ఎంత కీలకమో చెబుతోంది. రిపబ్లికన్ లెఫ్ట్, రైట్ వర్గాల విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్–1బీ వీసాల భవిష్యత్తు ఇప్పుడు రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది.