విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం మరియు AM Green Group మధ్య మొత్తం ₹54,000 కోట్ల విలువైన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ ఒప్పందాలతో ఉత్తరాంధ్ర ప్రాంతం గ్రీన్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, సస్టైనబుల్ ఇండస్ట్రీస్ రంగాల్లో దేశవ్యాప్తంగా కీలక కేంద్రంగా ఎదగనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ ఒప్పందాలలో ప్రధానమైనది కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో ఏర్పాటు కానున్న గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్. AM Green ఈ ప్రాజెక్టుకు రెండు దశల్లో కలిపి ₹44,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ఆధునిక కాంప్లెక్స్ మాత్రమే కాక ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో ఉండబోతున్న RFNBO-కాంప్లైంట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా ఇదే పరిసరాల్లో స్థాపించేందుకు సంస్థ సిద్ధమైంది. పరిశ్రమలు కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించే దిశగా ఈ రెండు ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇక మరో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలు బయోఫ్యూయల్ సెక్టార్‌లో కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం మరియు ఆనకాపల్లి జిల్లాల్లో ₹10,000 కోట్లతో పలు బయో రిఫైనరీలు, 2G ఎథనాల్ యూనిట్లు, అలాగే సంవత్సరానికి 180 KTPA సామర్థ్యం గల Sustainable Aviation Fuel (SAF) ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్లు వ్యవసాయ మిగులు, బయోమాస్ వంటి పదార్థాలను ఉపయోగించి తదుపరి తరం శుద్ధ ఇంధనాన్ని తయారు చేస్తాయి. దీని వలన రైతులకు కొత్త ఆదాయ మార్గాలు, పరిశ్రమలకు గ్రీన్ ఇంధనం ప్రాంతానికి మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తిగా అమలులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రపంచ శ్రేణి “ఫార్మ్ టు ఫ్లైట్ ఎకోసిస్టమ్” కు కేంద్రంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే రైతు పొలాల్లో పండే బయోమాస్ నుంచి విమానాలకు అవసరమైన సస్టైనబుల్ ఫ్యూయల్ వరకు ఒకే రాష్ట్రంలో తయారవుతాయి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురానుంది.
విజాగ్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు రాష్ట్రం అందించే సౌకర్యాలు వేగవంతమైన అనుమతి వ్యవస్థ, దృఢమైన పోర్ట్–ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా వంటి అంశాలను వివరించారు. కేంద్ర సివిల్ ఎవియేషన్ (విమానయానం) శాఖ మంత్రి కిన్జరపు రామ్ మోహన్ నాయుడు పెట్టుబడులకు ఉత్తమ గమ్యం ఆంధ్రప్రదేశ్ కావాలని అధునాతన పరిశ్రమలకు అవసరమైన మద్దతు మొత్తం ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ ఒప్పందాలు అమలు దశలోకి ప్రవేశించిన తర్వాత వేలాది ఉద్యోగాలు మెరుగైన పరిశ్రమల వాతావరణం, పచ్చ ఇంధన ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రానికి అందుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ పెట్టుబడులు ఉత్తరాంధ్రను దేశంలోనే కాక ఆసియా ఖండంలో కీలక గ్రీన్ ఎనర్జీ హబ్‌గా నిలబెట్టే అవకాశాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి.