ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మంచి శుభవార్త అందింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలుచేస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం కిసాన్ 21వ విడతను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు కూడా అదే రోజున విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం కూటమి ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం 2025 ఆగస్ట్ నెలలో మొదటి విడతగా రూ.7000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5000 కలిపి మొత్తం రూ.7000 అందించారు. 47 లక్షలకు పైగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్ము జమైంది.
అర్హత సమస్యలు, eKYC, NPCI మ్యాపింగ్ వంటి కారణాలతో కొంతమంది రైతులకు మొదటి విడత డబ్బులు అందకపోయినా, ఆ సమస్యలు పరిష్కరించబడిన వెంటనే వారికి కూడా నిధులు జమ చేశారు. ఇప్పుడు రెండో విడత విడుదలకు సంబంధించి వ్యవసాయ శాఖ, ఆర్ధిక శాఖ ఇప్పటికే ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం 21వ విడత రిలీజ్ చేసే తేదీకి అనుగుణంగా మొత్తం రాష్ట్రం కూడా సిద్ధమవుతోంది.
పీఎం కిసాన్ 21వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ విడత కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకు రూ.2000 చొప్పున జమ చేయనున్నారు. అదే రోజున అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా విడుదల చేస్తే, ఆంధ్రప్రదేశ్ రైతులకు రెండో విడతగా మంచి మొత్తం చేరే అవకాశం ఉంది.
ఈ పథకానికి ప్రధాన లక్ష్యం రైతులకు పెట్టుబడి సాయం అందించడం. గత వైసీపీ ప్రభుత్వం “రైతు భరోసా” పేరుతో ఇలాంటి పథకం అమలుచేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం రూ.20,000 వార్షిక సహాయం రైతులకు అందుతోంది. నవంబర్ 19న నిధులు విడుదలైతే రైతులకు పంట కాలంలో పెద్ద తోడ్పాటు లభించనుంది.