అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కీలకమైన ఆర్థిక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ధరల పెరుగుదలపై విపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా విమర్శలు చేస్తూ, ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో దీనినే ప్రధాన ఎజెండాగా మార్చి విజయాలు సాధించారు. దీనితో ఏర్పడిన రాజకీయ ఒత్తిడిని తగ్గించేందుకు ట్రంప్ సర్కార్ పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై విధించిన సుంకాలను తగ్గిస్తూ శుక్రవారం ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే మామిడి, దానిమ్మ, టీ, కాఫీ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు విశేషంగా లాభం చేకూర్చనుంది.
వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో, టమోటాలు, నారింజ, బీఫ్ వంటి వాటిపై ఇప్పటివరకు కొనసాగుతున్న సుంకాలను తొలగించారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో పాటు అనేక దేశాల నుండి వస్తున్న దిగుమతులపై 25 శాతం సుంకం విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకం కూడా పెంచింది. ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో పలు ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగిపోయాయి. అమెరికా మార్కెట్లో ఆహార సరుకులపై పెరిగిన ధరలు నేరుగా వినియోగదారులపై భారంగా మారడంతో, ప్రభుత్వానికి విపరీతమైన ప్రతికూలత వచ్చింది.
ఇటీవల న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా ఎన్నికల్లో డెమొక్రాట్లు ధరల తగ్గింపు అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి మంచి ఫలితాలు సాధించారు. ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 63 శాతం మంది అమెరికన్లు ట్రంప్ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ట్రంప్, ఇవన్నీ డెమొక్రాట్లు చేస్తున్న “కంప్లీట్ కాన్ జాబ్” మాత్రమేనని ఆరోపించారు. బైడెన్ పాలనలో ద్రవ్యోల్బణం 19.7 శాతానికి చేరిందని, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం 3 శాతం స్థాయికి పడిపోయిందని గుర్తుచేశారు. అయితే ద్రవ్యోల్బణం తగ్గినా, పలు ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రం పెరిగినట్టే వినియోగదారుల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో మామిడి, దానిమ్మ వంటి పండ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రభుత్వం భారత మామిడిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం కీలక ఘట్టం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో కూడా మామిడి, దానిమ్మ ఎగుమతుల గురించి ట్రంప్–మోదీ సంయుక్త ప్రకటనలో ప్రస్తావించబడింది. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం ఇప్పటికే ఔషధాల దిగుమతులపై సుంకాలను తగ్గించిన ట్రంప్ సర్కార్, ఇప్పుడు ఆహార ఉత్పత్తులపైనా నిర్ణయాత్మక మినహాయింపులు ఇచ్చింది. దీనితో భారత్ సహా అనేక దేశాల వ్యవసాయ ఎగుమతులకు గ్లోబల్ మార్కెట్లో మరింత అవకాశాలు పెరిగే అవకాశముంది.