దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న సందర్భంలో, గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI), చంద్రగిరిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీసం 8వ తరగతి చదివిన యువతకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం విశేషం. నెల రోజుల శిక్షణతో పాటు శిక్షణార్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కూడా అందిస్తున్నారు.
ఈ శిక్షణ ద్వారా నిరుద్యోగ యువత తమతమ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం లభిస్తుంది. కొన్ని ప్రభుత్వ పథకాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల సేవలతో పాటు బ్యాంకులు కూడా ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యావంతులే కాకుండా తక్కువ చదువుకున్న వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
పురుషులకు విభిన్న కోర్సులను అందిస్తున్నారు. అందులో మొబైల్ ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, బైక్ సర్వీసింగ్, ఫ్రిజ్ మరమ్మతులు, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ & సర్వీసింగ్, వర్మీ కంపోస్ట్ తయారీ, లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్ వంటి శిక్షణలు ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన తర్వాత వారు స్వంతంగా సర్వీస్ సెంటర్‌లు, రిపేర్ షాపులు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది.
మహిళలకు కూడా ప్రత్యేకంగా కోర్సులు అందిస్తున్నారు. అందులో బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ తయారీ, టైలరింగ్, కాస్ట్యూమ్ జ్యువెలరీ, అగరబత్తులు తయారీ, మసాలా పొడులు, అప్పడాల తయారీ, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ వంటి శిక్షణలు ఉన్నాయి. వీటిలో చాలా కోర్సులు ఇంటి వద్ద నుంచే సులభంగా చేయగలిగేవి కావడంతో మహిళలకు అవి ప్రత్యేకంగా ప్రయోజనకరం.
ఈ శిక్షణకు అర్హతలు కూడా సులభమే. గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి, వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు చంద్రగిరి RSETI సంస్థను నేరుగా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 79896 80587, 94949 51289, 63017 17672 నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది.