ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు టైడ్ గ్రాంట్ భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి విడుదలయ్యాయి. స్థానిక సంస్థల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం తొలి విడతగా రూ.410 కోట్లను ఏపీ పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లు, 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీలు లబ్ధి పొందాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.548 కోట్లతో స్థానిక సంస్థలకు అదనపు శక్తి లభించనుంది. ఈ నిధులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఆదేశాలు వెళ్లాయి.
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల నిధులు, 15వ ఆర్థిక సంఘం పెండింగ్ అమౌంట్లు, అమృత్ పథకం నిధులపై చర్చించారు. మంత్రి నారాయణ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో, ఏపీ ప్రభుత్వం పెండింగ్ నిధుల విడుదలపై మరింత దృష్టి పెట్టింది. దీని ఫలితంగా రాష్ట్రానికి వచ్చే రోజుల్లో మరిన్ని ఆర్థిక లాభాలు అందే అవకాశం ఉంది.
అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్ల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషోన్నతి యోజన పథకం కింద ఈ నిధులను వినియోగించేలా పరిపాలన అనుమతులు ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, నర్సరీ స్థాపన కోసం ఈ మొత్తాలను ఉపయోగిస్తారు. గ్రామీణ వ్యవసాయ రంగానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు కూడా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 మార్చి 31తో ముగిసిన ఈ గడువును ఇప్పుడు 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీతో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇది సహాయపడుతుందని అధికారులు అంటున్నారు.