విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత కరువైందనే ఆందోళనలు మరోసారి పెరిగాయి. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోని పశ్చిమ లండన్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్థానీ మూలాలున్న వ్యక్తులు నడుపుతున్న 'గ్రెమింగ్ గ్యాంగులు' (Grooming Gangs) ఒక సిక్కు బాలికను కిడ్నాప్ చేసి, బంధించి, అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
హౌన్స్లో ఘటన: అసలేం జరిగింది?
'ది సండే గార్డియన్' కథనం ప్రకారం, పశ్చిమ లండన్లోని హౌన్స్లో ప్రాంతంలో 15 ఏళ్ల ఒక సిక్కు బాలికను పాకిస్థానీ మూలాలున్న ఆరుగురు సభ్యుల ముఠా కిడ్నాప్ చేసింది. ఆ బాలికను ఒక రహస్య ఫ్లాట్లో బంధించి, ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు. నిందితులు ఈ అమానుషాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది.
పోలీసుల కంటే ముందే స్పందించిన సిక్కు సమాజ ప్రతినిధులు, బాధితురాలి ఆచూకీని కనిపెట్టారు. సుమారు 300 మంది సిక్కు యువకులు నిందితుడి ఇంటిని ముట్టడించి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. చివరికి పోలీసుల సాయం లేకుండానే ఆ బాలికను వారు సురక్షితంగా రక్షించుకోవడం గమనార్హం.
యూకేలో ఈ ముఠాల పనితీరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా 11 నుండి 16 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. మొదట ప్రేమ, స్నేహం పేరుతో లేదా బహుమతులు ఇస్తూ అమ్మాయిలకు దగ్గరవుతారు. ముఖ్యంగా సిక్కు, హిందూ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలను వీరు లక్ష్యంగా చేసుకుంటారు. ఒక్కసారి తమ వలలో చిక్కుకున్నాక, వారిని డ్రగ్స్ లేదా బెదిరింపులతో లొంగదీసుకుని సామూహిక అత్యాచారాలకు, లైంగిక దోపిడీకి పాల్పడుతుంటారు.
ఇది ఒక కొత్త సమస్య కాదు. 2014లో వెలువడిన అలెక్సిస్ జే నివేదిక యూకేను షాక్కు గురిచేసింది. ఒక్క రోథర్హామ్ పట్టణంలోనే 1997 నుండి 2013 మధ్య సుమారు 1,400 మంది చిన్నారులు లైంగిక దోపిడీకి గురయ్యారని ఆ నివేదిక తేల్చింది. ఈ నేరాలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం పాకిస్థానీ మూలాలున్నవారేనని స్పష్టమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే 'జాతి వివక్ష' (Racism) ఆరోపణలు వస్తాయనే భయంతో స్థానిక అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
లండన్ ఘటన యూకేలోని చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న మత ఛాందసవాదాన్ని, వ్యవస్థీకృత నేర ముఠాలను అదుపు చేయకపోతే యూకేలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించి, అక్కడ ఉంటున్న భారతీయ మూలాలున్న మైనారిటీల భద్రత గురించి యూకే అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉంది.