ఇటీవలి రోజుల్లో జరిగిన భారీ అంతరాయాల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న దేశంలో అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో, ఇప్పుడు తన కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించుకుంటోంది. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి, సేవలను తిరిగి గాడిలో పెట్టడానికి సంస్థ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, కార్యకలాపాల స్థిరీకరణలో మంచి పురోగతి కనిపిస్తోందని ఇండిగో తెలిపింది. సేవలలో వచ్చిన అంతరాయాలకు కారణమైన సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
శనివారం సంస్థ మొత్తం 1,500 విమాన సర్వీసులు నడపగా, ఆదివారం ఈ సంఖ్యను 1,650కి పైగా పెంచడం ఇండిగో సేవలు మళ్లీ వేగం పట్టినట్టే. ముఖ్యంగా విమానాల సమయపాలన (OTP) కేవలం 30 శాతం నుంచి ఒక్క రోజులోనే 75 శాతానికి చేరడం సంస్థ కార్యకలాపాల పునరుద్ధరణకు పెద్ద సూచికగా నిలిచింది. నెట్‌వర్క్ స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లు పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది బలోపేతం, రద్దు అయిన విమానాల సమాచారాన్ని సమయానికి చేరవేయడం వంటి చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు రిఫండ్ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు ఇండిగో తెలిపింది. బ్యాగేజీ ప్రాసెసింగ్ కూడా మునుపటి సామర్థ్యానికి చేరిందని పేర్కొంది. డిసెంబర్ 10 నాటికే కార్యకలాపాలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తొలుత అంచనా వేసిన దానికంటే ముందుగానే సేవలను పూర్తిగా పునరుద్ధరించడం తమ ప్రధాన లక్ష్యమని కూడా సంస్థ వెల్లడించింది.
ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా సవ్యంగానే ఉన్నప్పటికీ, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరే ముందు తమ వెబ్‌సైట్‌లో ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా చూసుకోవాలని సంస్థ సూచించింది. గత కొన్ని రోజులుగా ఎదురైన అసౌకర్యానికి మరోసారి క్షమాపణలు చెబుతూ, సహనంగా వ్యవహరించిన ప్రయాణికులకు, అనవరతంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యకలాపాల సాధారణీకరణ కోసం సంబంధిత అధికారులతో కలిసి సమన్వయం కొనసాగిస్తున్నట్లు ఇండిగో స్పష్టంచేసింది.