చిన్నారుల ఎదుగుదల దశలో పోషకాహారం అనేది పునాది వంటిది. ముఖ్యంగా ఒక సంవత్సరం దాటిన పిల్లలకు శారీరక మార్పులతో పాటు, మెదడు వికాసం వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో వారికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన పోషకం 'ప్రోటీన్'. మాంసాహారం తినే అలవాటు ఉన్న కుటుంబాల్లో పిల్లలకు చికెన్ పెట్టడం సర్వసాధారణం. అయితే దానిని ఏ రూపంలో ఇస్తే పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయంలో చాలామంది తల్లులలో సందిగ్ధత నెలకొంది. ఉడికించిన చికెన్ పెట్టాలా లేదా వేయించిన చికెన్ పెట్టాలా అనే విషయాలను తెలుసుకుందామా మరి.
ఉడికించిన చికెన్:
చికెన్‌ను నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టడం (Boiling) అనేది అత్యుత్తమమైన పద్ధతి. సైంటిఫిక్ పరంగా చూస్తే, మాంసాన్ని ఉడికించినప్పుడు అందులోని ఫైబర్స్ మెత్తబడతాయి. దీనివల్ల పిల్లలకు సులభంగా నమల గలరు. ఉడికించిన నీటిలో అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వారి ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఒక సంవత్సరం దాటిన పిల్లలకు కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది కాబట్టి, రుచి కోసం తగినంత ఉప్పు వాడటంలో ఎటువంటి ప్రమాదం లేదు.
వేపుడు పదార్థాలు ఎందుకు వద్దు?
పిల్లలకు నూనెలో వేయించిన చికెన్ లేదా 'చికెన్ ఫ్రై' ఇవ్వడం వల్ల రుచిగా అనిపించినప్పటికీ, అది ఆరోగ్యానికి హానికరం. నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు చికెన్ గట్టిగా మారిపోతుంది. ఇది చిన్న పిల్లల సున్నితమైన జీర్ణవ్యవస్థపై భారాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, వేపుడు పదార్థాల వల్ల పిల్లల్లో ఊబకాయం (Obesity), గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. చిన్న వయస్సు నుండే నూనె పదార్థాలకు అలవాటు పడితే, వారు ఇతర ఆరోగ్యకరమైన కూరగాయలను తినడానికి ఆసక్తి చూపరు.
తల్లులకు నిపుణుల సూచనలు:
మృదుత్వమే కీలకం: చికెన్ ముక్కలు వెన్నలా మెత్తగా ఉండాలి. బాగా ఉడికించడం వల్ల ఇది సాధ్యమవుతుంది.
నెయ్యి జోడించండి: నూనెకు బదులుగా చికెన్ వండేటప్పుడు ఒక చెంచా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడండి. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి (DHA) ఎంతో అవసరం.
మసాలాల నియంత్రణ: కారం మరియు గరం మసాలాకు బదులుగా జీలకర్ర, చిటికెడు మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
చికెన్ ఉడకబెట్టే పద్ధతి చాలా సురక్షితమైనది వేపుడు పదార్థాల జోలికి వెళ్లకుండా, ఉడికించిన చికెన్‌తో పాటు ఇతర పోషకాలు కలిపి అందించడం వల్ల మీ పాప ఆరోగ్యంగా చురుగ్గా పెరుగుతుంది. మారుతున్న కాలంలో పిల్లల ఆహారపు అలవాట్లపై దృష్టి సారించడం ప్రతి తల్లి ప్రాథమిక బాధ్యత.