భారతదేశంలో మహిళల్లో ఆటోఇమ్యూన్ వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయన్న విషయం ఇప్పుడు వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేసుకుందనే చెప్పుకోవాలి. గతంలో చాలా అరుదుగా వినిపించిన ఈ వ్యాధులు, ప్రస్తుతం యువతులు, మధ్య వయసు మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. శరీరాన్ని రక్షించాల్సిన రోగనిరోధక వ్యవస్థే తప్పుదారి పట్టి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేయడమే ఆటోఇమ్యూన్ వ్యాధుల ప్రధాన లక్షణం. దీని వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వైద్య పరిశోధనల ప్రకారం భారతదేశంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది మహిళలే. అంటే ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. లూపస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, విటిలిగో, క్రోన్స్ డిసీజ్ వంటి వ్యాధులు మహిళల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళల హార్మోన్ల వ్యవస్థ, జీవనశైలి, పర్యావరణ ప్రభావాలు ఇందుకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధులు మొదట్లో చాలా సాధారణ లక్షణాలతోనే మొదలవుతాయి. తరచూ అలసటగా ఉండటం, సరైన నిద్ర తీసుకున్నా శరీరం నీరసంగా అనిపించడం మొదటి సంకేతంగా చెప్పుకోవచ్చు. రోజువారీ పనులు చేయడానికి కూడా శక్తి లేకపోవడం, చిన్న పనికే విపరీతమైన అలసట రావడం ఉంటే దానిని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది మహిళలు దీనిని సాధారణ ఒత్తిడి లేదా ఇంటి పనుల అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఇంకొక ముఖ్యమైన లక్షణం కీళ్ల నొప్పులు, వాపులు. ముఖ్యంగా చేతులు, మోకాళ్లు, కాళ్ల కీళ్లలో నొప్పి ఉండటం వంటి సమస్యలు ఉంటే అవి ఆటోఇమ్యూన్ వ్యాధుల సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ లేదా లూపస్ వంటి వ్యాధుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కేవలం నొప్పి ఉందని స్వయంగా నిర్ధారణ చేసుకోవడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.
చర్మంపై మార్పులు కూడా ఈ వ్యాధులకు సూచనగా ఉంటాయి. ముఖం, చేతులు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో ఎర్రటి దద్దుర్లు, రంగు మారడం, మచ్చలు రావడం లాంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి లోపల జరుగుతున్న హార్మోన్ల అసమతుల్యతకు బయటి సంకేతాలుగా భావించవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో భాగంగా ఉండే అవకాశం ఉంది. తరచూ పొట్ట నొప్పి, విరేచనాలు, ఉబ్బరం లాంటి సమస్యలు నిరంతరం కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణలో ఇబ్బందులు కూడా కొన్ని ఆటోఇమ్యూన్ వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గాలి కాలుష్యం, కలుషిత నీరు, శారీరక వ్యాయామం లోపం, మానసిక ఒత్తిడి ఇవన్నీ ప్రమాదాన్ని పెంచే అంశాలుగా గుర్తించబడ్డాయి.
చాలా మంది మహిళలు తమ ఆరోగ్య సమస్యలను కుటుంబ బాధ్యతలు, పనుల మధ్య తక్కువగా భావించి డాక్టర్ దగ్గరకు వెళ్లడం ఆలస్యం చేస్తుంటారు. కానీ ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఈ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అవగాహనతో పాటు సరైన జీవనశైలి పాటిస్తే ఆటోఇమ్యూన్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.