ఫ్రిజ్ మన రోజువారీ జీవితంలో తప్పనిసరిగా మారిపోయింది. ఇంట్లో వండిన ఆహారం ఎక్కువసేపు పాడవకుండా ఉండాలన్నా, కూరగాయలు, పండ్లు తాజాగా ఉండాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్రిజ్. అయితే చాలా మందికి ఒక విషయం తెలియదు ఫ్రిజ్‌లో పెట్టే ప్రతి ఆహార పదార్థం సురక్షితంగా ఉంటుందన్నది నిజం కాదు. కొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి రుచి తగ్గడమే కాదు, పోషక విలువలు తగ్గే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఆరోగ్యానికి హానికరంగా మారే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందుకే ఏ ఆహారం ఫ్రిజ్‌లో పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే అవగాహన ఉండటం చాలా అవసరం.
ముందుగా బంగాళదుంపల విషయానికి వస్తే, చాలా ఇళ్లలో అవి ఫ్రిజ్‌లో పెట్టడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. బంగాళదుంపలను చల్లని వాతావరణంలో ఉంచితే వాటిలోని స్టార్చ్ త్వరగా చక్కెరగా మారిపోతుంది. దీంతో వండినప్పుడు రుచి మారిపోతుంది. అంతేకాదు, ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచిన బంగాళదుంపలు గట్టిపడి, వండడానికి అనర్హంగా మారుతాయి. బంగాళదుంపలను చల్లగా కాకుండా, పొడి మరియు గాలి ఉండే ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
అరటిపండ్లు చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోలేవు ఫ్రిజ్‌లో పెట్టిన వెంటనే వాటి తొక్క నల్లబడటం మొదలవుతుంది. బయటకు చూస్తే పండ్లు పాడైపోయినట్టుగా కనిపిస్తాయి. అంతేకాదు, లోపలి భాగం కూడా మెల్లగా రుచి కోల్పోతుంది. అరటిపండ్లు సహజంగా గది ఉష్ణోగ్రతలోనే పక్వం చెందాలి. పూర్తిగా పండేలోపే కొనుగోలు చేసి, బయటే ఉంచితే మంచి రుచి, పోషకాలు లభిస్తాయి. రక్తపోటు నియంత్రణకు కూడా అరటిపండ్లు ఉపయోగపడతాయనే విషయం తెలిసిందే.
పుచ్చకాయ, ఖర్బూజ వంటి పండ్లను కూడా ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. చాలామంది వేసవిలో చల్లగా తినాలనే ఉద్దేశంతో వీటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ ఇది వాటి తాజాతనాన్ని తగ్గిస్తుంది. చల్లని వాతావరణం వల్ల పుచ్చకాయ తేమ తగ్గి, త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి కట్ చేసిన తర్వాత మాత్రం ఫ్రిజ్‌లో పెట్టడం తప్పనిసరి. లేదంటే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది.
మొత్తానికి ఫ్రిజ్ అన్నది అన్నింటికీ సరిపడే పరిష్కారం కాదు. కొన్ని ఆహార పదార్థాలు సహజ వాతావరణంలోనే బాగా నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి రుచి, పోషక విలువలు కోల్పోతాయి. అందుకే ఇంట్లో ఆహారం నిల్వ చేసే ముందు చిన్న అవగాహన ఉండటం చాలా అవసరం. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఆహారం వృథా కాకుండా ఉంటుంది, ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.