చైనాలోని ఓ పాఠశాలలో నోరో వైరస్ కలకలం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఒక్కసారిగా వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు అత్యవసరంగా రంగంలోకి దిగారు. నిర్వహించిన పరీక్షల్లో 103 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో స్థానిక పరిపాలన యంత్రాంగం అప్రమత్తమై స్కూలు క్లాస్‌రూమ్‌లు, కారిడార్లు, ఆటస్థలాలు సహా మొత్తం ఆవరణలో వైరస్ నిర్మూలన మందును పిచికారీ చేసింది. బాధిత విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్స అందిస్తూ, మిగతా విద్యార్థులకు వైరస్ వ్యాపించకుండా కఠిన నివారణ చర్యలు చేపట్టింది.
వైరస్ బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, అందరూ కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీగా పర్యవేక్షిస్తూ ప్రత్యేక హెల్త్ చెక్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన విద్యార్థులను వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే స్కూలు పరిసర ప్రాంతాల్లోని నివాస సముదాయాల్లో నివసిస్తున్న వారికీ ముందుజాగ్రత్తగా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వైరస్ వ్యాప్తిని ప్రారంభ దశలోనే అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి.
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో నోరో వైరస్ ఎక్కువగా విజృంభిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇది సాధారణంగా కనిపించే వైరస్ అయినప్పటికీ, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని హెచ్చరించారు. పరిశుభ్రత లోపం, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వైరస్ త్వరగా పాకే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నోరో వైరస్‌ను తొలిసారిగా 1968లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్‌వాక్ పట్టణంలోని ఓ పాఠశాలలో గుర్తించారు. ఆ ప్రాంతం పేరునే ఈ వైరస్‌కు ‘నోరో వైరస్’ అని పేరు పెట్టారు. అమెరికాలో ఎక్కువగా ఆహారం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 68.5 కోట్ల మంది నోరో వైరస్ బారిన పడుతుండగా, అందులో 20 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఈ వైరస్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది చిన్నారులు సహా దాదాపు 20 లక్షల మంది మృతి చెందుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నోరో వైరస్‌పై అవగాహన పెంచుకోవడం, పరిశుభ్రత పాటించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.