యుఏఈలో త్వరలో జరగనున్న 54వ ఈద్ అల్ ఇత్తిహాద్ (జాతీయ దినోత్సవం) సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ ఉత్సాహం నెలకొంది. నాలుగు రోజుల సుదీర్ఘ సెలవులతో కలిసి ఈ వేడుకలను అత్యంత విశేషంగా నిర్వహించేందుకు కుటుంబాలు, ప్రవాసులు సిద్ధమవుతుండగా, ప్రజల భద్రత, రోడ్లపై శాంతి భద్రత కోసం యుఏఈ గృహ మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ఉత్సవాల సమయంలో ఎవరి ఆనందం ప్రజా భద్రతకు భంగం కలిగించకూడదన్నదే ఈ నిబంధనల ఉద్దేశ్యం.
సెలబ్రేషన్స్‌కు అనుమతించిన కార్యాకలాపాలతో పాటు, ప్రజలు తప్పనిసరిగా నివారించాల్సిన 11 నిషేధిత చర్యలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. జాతీయ దినోత్సవ ఆనందాన్ని వ్యక్తపరచడానికి వాహనాలపై అధికారిక ఈద్ అల్ ఇత్తిహాద్ స్టికర్లను ఉపయోగించడం, యుఏఈ జెండాను గౌరవంగా ఎగరేయడం అనుమతించబడినప్పటికీ, కొన్ని చర్యలు పూర్తిగా నిషేధించబడ్డాయి.
వీటిలో ప్రధానంగా రోడ్లపై అనధికార పరేడ్‌లు నిర్వహించడం, వాహనాలను నిలిపి ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, స్టంట్ డ్రైవింగ్ చేయడం, కిటికీలు లేదా సన్‌రూఫ్‌ల నుండి వేలాడుతూ ప్రయాణించడం, వాహనాల్లో అనుమతికి మించిన సంఖ్యలో ప్రయాణించడం, నెంబర్ ప్లేట్లను కప్పివేయడం, వాహనాలకు అనధికార మార్పులు చేయడం, అతిగా శబ్దం చేసే సంగీతం ప్లే చేయడం వంటి చర్యలు ఉన్నాయి. ఇవి భద్రతకు ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలు గుర్తిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
వాహనాలపైనే కాదు, ప్రజా ప్రదేశాల్లో కూడా ఏ విధమైన గందరగోళానికి అవకాశం ఇవ్వబోదని అధికారులు తెలిపారు. జాతీయ దినోత్సవం పేరుతో UAE జెండా కాకుండా ఇతర జెండాలను ఎగరేయడం కూడా నిషేధం. వాహనాలపై స్ప్రే పెయింట్ వాడటం, అంగీకరించని విధంగా స్కార్ఫ్‌లు, అలంకరణలు ధరించడం వంటి చర్యలు కూడా ఎదుర్కోవాల్సిన శిక్షల జాబితాలో ఉన్నాయి.
ఈ వేడుకల సమయంలో యుఏఈ జెండా వినియోగoకు సంబంధించిన 15 కీలక నిబంధనలను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జెండాను ఎగరేయేటప్పుడు దాని రంగులు, పరిమాణం, నిష్పత్తి, శుభ్రత వంటి అంశాలు గౌరవంతో పాటించాలనేది ముఖ్య సూచన. జెండాను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు, పాడైపోయిన జెండాను ఉపయోగించకూడదు, రాష్ట్ర చిహ్నాన్ని అవమానించే విధంగా వాడరాదు అని స్పష్టంచేశారు.
జాతీయ దినోత్సవం యుఏఈ ప్రజలకు అత్యంత గౌరవనీయమైన రోజు. దేశ ఏకత, అభివృద్ధి, సామాజిక సమైక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలు సురక్షితంగా సాగేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలను నివాసితులు స్వాగతిస్తున్నారు. ఉత్సవాలు ఎంత విస్తారంగా జరిగినా, ప్రజా భద్రతకు ఏమాత్రం భంగం కలగకూడదన్నదే అధికారుల ప్రధాన లక్ష్యం.
సురక్షితంగా, గౌరవప్రదంగా, దేశభక్తితో ఈ అల్ ఇత్తిహాద్ వేడుకలు జరుపుకోవాలని అధికారుల విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా ఉత్సాహం ఉరకలేస్తున్న నేపథ్యంలో, ఈ మార్గదర్శకాలు వేడుకలను మరింత క్రమబద్ధంగా, అందరికీ సురక్షితంగా ఉండేలా చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!!