ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాల పథకానికి భారీ స్పందన లభిస్తోంది. దివ్యాంగులకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను 100% రాయితీతో పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. మొదటగా ఈ నెల 25 వరకు దరఖాస్తుల గడువు నిర్ణయించినప్పటికీ, ఎక్కువ మంది దివ్యాంగులు లైసెన్స్ సమస్యలతో ఇబ్బంది పడతుండటంతో గడువును 30వ తేదీ వరకు పొడిగించింది. 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న, 8 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతినియోజకవర్గానికి 10 వాహనాలు, జిల్లాల వారీగా 80 వాహనాల చొప్పున కేటాయించింది. అందులో 50 శాతం స్కూటర్లు మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.30 లక్షలు ఉన్నప్పటికీ దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, కుల – ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. విద్యార్థులు బోన్‌ఫైడ్ సర్టిఫికేట్, స్వయం ఉపాధి పొందుతున్న వారు లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు ఉపాధి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, ఈ పథకం కింద ఎంపికయ్యే వారు వాహనం పొందే సమయానికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అనేక మంది దివ్యాంగులకు డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడంతో వారికి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌ఆర్ జారీ కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన దివ్యాంగులకు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వారికి అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దీని వల్ల గతంలో లైసెన్స్ లేని దివ్యాంగులు కూడా ఇప్పుడు మూడు చక్రాల వాహనం పొందేందుకు అర్హత సాధిస్తున్నారు. ఇది ప్రభుత్వ పథకాన్ని మరింత చేరువ చేసే కీలక నిర్ణయంగా కనిపిస్తోంది.
ఈ వాహనాలు చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు, స్వయం ఉపాధి, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎంపికైన వారు ఈ వాహనం సహాయంతో ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా, రోజువారీ ప్రయాణాల్లో భరోసా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగుల స్వావలంబనకు ఈ పథకం పెద్ద దోహదం చేయనుంది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30లోపు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.