ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లల ఉన్నత చదువులు మరియు పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకుండా చూసేందుకు ఉద్దేశించబడింది.
ఈ పథకంలో 10 సంవత్సరాల లోపు వయసు గల ఆడపిల్లల పేరుపై ఖాతా తెరవవచ్చు. పాప తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు (Guardian) ఈ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఒక పాప పేరుపై ఒకే అకౌంట్ మాత్రమే తెరవడానికి అనుమతి ఉంది. ఈ ఖాతాను ఏదైనా అధీకృత పోస్టాఫీసు లేదా ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకుల్లో తెరవవచ్చు.
ఏడాదికి కనీసం రూ. 250 తో ఖాతాను ప్రారంభించవచ్చు. ఏడాదికి గరిష్ఠంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల పాటు మాత్రమే ఇందులో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తర్వాత ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. ఈ పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు.. ప్రస్తుతం ఈ పథకం కింద 8.20% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటును కేంద్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది.
ఈ పథకంలో జమ చేసే మొత్తం, వడ్డీ, మరియు మెచ్యూరిటీ మొత్తం—అన్నింటికీ ఆదాయపు పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పాప 10వ తరగతి పూర్తయిన తర్వాత లేదా 18 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఉన్నత విద్య ఖర్చుల కోసం ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాప 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తే, అకౌంట్‌ను క్లోజ్ చేసి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పథకం ద్వారా సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 కోట్లకు పైగా సుకన్య యోజన ఖాతాలు తెరవబడ్డాయి. ఈ ఖాతాలలో ఇప్పటి వరకు రూ. 3.25 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు జరిగాయి.