TDP 44th Anniversary: కువైట్‌లో హోరెత్తిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. భారీ రక్తదాన శిబిరంతో మానవత్వం చాటిన ఎన్నారై తెలుగుదేశం జనసేన సైన్యం!
TDP 44th Anniversary: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ మేరకు వందలాది మంది కార్యకర్తలు రక్తదానం చేయగా, దాతలకు ఏపీ ప్రభుత్వం అందించే 'ప్రవాసాంధ్ర భరోసా' బీమాను ఉచితంగా అందజేశారు.
Kuwait City: తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, కువైట్‌లోని ఎన్నారై టీడీపీ విభాగం వినూత్నంగా స్పందించింది. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమకు పార్టీపై ఉన్న మక్కువను చాటుకున్నారు. గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు పర్యవేక్షణలో, మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ప్రవాసాంధ్రులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రస్తుతం కువైట్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, అక్కడి ప్రభుత్వం స్వచ్ఛంద రక్తదానం చేయాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందించిన టీడీపీ నేతలు బిల్లా రమేష్ సారథ్యంలో ఏకంగా మూడు రోజుల పాటు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుండి ‘పసుపు తమ్ముళ్లు’ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదాన్ బ్లడ్ బ్యాంక్ జాబ్రియా సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వేదికలుగా జరిగిన ఈ రక్తదాన క్రతువులో వందలాది మంది పాల్గొని ప్రాణదాతలుగా నిలిచారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంతకం చేసిన ప్రశంసా పత్రాలను అందజేశారు. పల్లా శ్రీనివాసరావు గారు వీడియో సందేశం ద్వారా ధాతలను అభినందిస్తూ.. "మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, పార్టీ సిద్ధాంతమైన 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే నినాదానికి ఇది నిదర్శనం" అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నారైలు ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఒక విశేషమైన అడుగు పడింది. రక్తదానం చేసిన ప్రతి దాతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారైల కోసం ప్రవేశపెట్టిన ‘ప్రవాసాంధ్ర భరోసా’ బీమాను ఉచితంగా కల్పించారు. దీనికి అయ్యే ఒక్కొక్కరి ప్రీమియం ₹590లను ప్రముఖ నేత బిల్లా రమేష్ గారు స్వయంగా భరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి తక్షణ శక్తి కోసం పండ్లు, జ్యూస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించిన షేక్ బాషా, దుర్గాప్రసాద్ ఈడుపుగంటి, వి.సి. సుబ్బారెడ్డి తదితరులను సుధాకర రావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వేడుకల్లో టీడీపీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు భుజం భుజం కలిపి పని చేయడం విశేషం. కార్యక్రమంలో రషీదా బేగం, ఖాదరున్, కొల్లి ఆంజనేయులు వంటి టీడీపీ నేతలతో పాటు జనసేన తరపున కంచన శ్రీకాంత్, అంజన కుమార్ పగడాల, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. కువైట్ లో తెలుగు వారందరూ కలిసికట్టుగా చేసిన ఈ రక్తదాన శిబిరం స్థానిక అధికారుల ప్రశంసలు కూడా అందుకుంది.
Be the first to react