కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబి లోని ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్న హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. లేబర్ క్యాంప్ (కార్మికుల నివాస సముదాయం) లోకి తిరిగి ప్రవేశాన్ని నిరాకరించిన కంపెనీ యాజమాన్యం అమానవీయంగా వ్యవహరించడమే దీనికి కారణంగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎం. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు ప్రతులు అందజేశారు.
మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు. ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబిలో నివసిస్తున్న తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయం తో సమన్వయం చేస్తున్నారు.
యూఏఈలోని వరల్డ్ స్టార్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీలో క్లీనర్ వీసాపై నవంబర్ 11న అబుదాబి కి చేరుకున్న మాలోత్ శ్రీరాం, మతిస్థిమితం కోల్పోయి నవంబర్ 13న ముసఫ్ఫా ప్రాంతం లోని కంపెనీ లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యారు. సుమారు నెల రోజుల తర్వాత ఆయనను ఎవరో తిరిగి క్యాంప్‌కు చేర్చినా, కంపెనీ యాజమాన్యం ఆయనను లోపలికి అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించింది.
దీంతో ప్రస్తుతం శ్రీరాం ఆశ్రయం, ఆహారం, కనీస మానవ గౌరవం లేకుండా రోడ్లపై జీవిస్తున్నాడు. తిండి కోసం భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కంపెనీ అతనిపై 'అబుస్కాండింగ్' (పారిపోయాడు) అనే కేసు నమోదు చేసింది. అతడిని స్వదేశానికి పంపడానికి, 'డిపోర్ట్' (దేశ బహిష్కరణ) చేయడం కోసం 4,500 దిర్హములు (సుమారు ₹1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేస్తోంది.
శ్రీరాం స్వగ్రామంలో ఉన్న సమయంలో సంప్రదాయ ప్రకృతి సహజ పానీయాలైన తాటి, ఈత కల్లు సేవించే అలవాటు కలిగి ఉన్నారు. ఆయన సేవించిన కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈలో అలాంటి పానీయాలు లభించకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది వైద్య నిపుణుల ద్వారా మానసిక వైద్య పరీక్షలు, టాక్సికాలజీ ఆధారాలతో నిర్ధారించవలసిన అంశం.
భారత్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో తక్షణ వైద్య చికిత్స, పునరావాసం కల్పించాల్సిన అత్యవసర అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, న్యూఢిల్లీ లోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తగిన చర్యలు తీసుకొని, శ్రీరాంను సురక్షితంగా, త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అతని భార్య సునీత విజ్ఞప్తి చేశారు. తమది అత్యంత పేద కుటుంబమని, కంపెనీ డిమాండ్ చేస్తున్న భారీ జరిమానా గానీ, స్వదేశానికి తీసుకురావడానికి కావలసిన ఖర్చులు గానీ భరించే స్థితిలో తాము లేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.