ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించడంతో పనులకు మరింత ఊపొచ్చింది. కోర్ క్యాపిటల్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, నీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పన శరవేగంగా జరుగుతోంది. ఈ అభివృద్ధి నేపథ్యంలో అమరావతిలో రియల్ ఎస్టేట్‌కు భారీ డిమాండ్ పెరుగుతోంది.
తుళ్లూరు – తాడేపల్లి కారిడార్ అమరావతిలో హాట్ జోన్‌గా మారుతోంది. కోర్ క్యాపిటల్‌కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. తాడేపల్లిలో ఇప్పటికే అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం కోసం ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని KPHB కాలనీ తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మంగళగిరి ప్రాంతం మరో కీలక హబ్‌గా మారనుంది. జాతీయ రహదారి కనెక్టివిటీ ఉండటం, విజయవాడ–గుంటూరు మధ్యలో ఉండటం వల్ల మంగళగిరికి ప్రత్యేక లోకేషన్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటికే ఇక్కడ పలు ఐటీ కంపెనీల నిర్మాణాలు పూర్తయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు రావచ్చని భావిస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. ఉద్యోగావకాశాలు, నివాస సదుపాయాలు కలగలిపిన ప్రాంతంగా మంగళగిరి ఎదుగుతోంది.
ఉండవల్లి – పెనుమాక ప్రాంతం లగ్జరీ నివాసాలకు కేంద్రంగా మారుతోంది. కృష్ణా నది తీరంలో ఉండటం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగడం వల్ల ఈ ప్రాంతం హై ఎండ్ అపార్ట్మెంట్లకు అనుకూలంగా మారింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ తరహాలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఉన్నత వర్గాలకు చెందిన వారు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అమరావతిలో రియల్ ఎస్టేట్‌కు బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది. కోర్ క్యాపిటల్ అభివృద్ధి, ఐటీ కంపెనీల రాక, మెరుగైన కనెక్టివిటీ వల్ల తుళ్లూరు–తాడేపల్లి, మంగళగిరి, ఉండవల్లి–పెనుమాక ప్రాంతాలు పెట్టుబడులకు అనుకూలంగా మారుతున్నాయి. సరైన సమయంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.