ఇరాన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. 47 ఏళ్లుగా ( Iran 47 years) కొనసాగుతున్న ప్రభుత్వ నియంతృత్వం, ప్రజల స్వేచ్ఛను అణిచివేసిన దమనకాండ, ఇప్పుడు అగ్నిపర్వతంలా పేలిపోతోంది. నిరసనల్లో పాల్గొంటున్న ఓ యువకుడు మాట్లాడిన ఆవేదనాత్మక మాటలు ఈ ఉద్యమానికి ప్రాణంగా మారాయి. మమ్మల్ని చంపడం మీకు ఆటలా మారింది. మీరు వేటగాళ్లు, మేము వేటాడబడే జంతువులమని భావిస్తున్నారు. కానీ మా గుండెల్లో భయం లేదు.
47 ఏళ్లుగా మేము మోస్తున్న భరించలేని బాధ ఇప్పుడు అగ్నిలా బయటకు వస్తోంది. ఇక ఇది ఆగదు” అంటూ అతను తూటాలకు ఎదురుగా నిలబడిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క స్వరం వెనుక లక్షలాది ఇరాన్ ప్రజల నిశ్శబ్ద కేకలు దాగున్నాయి. రెండు వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. యువత, మహిళలు, కార్మికులు అందరూ తమ హక్కులు, స్వేచ్ఛ కోసం వీధుల్లోకి వచ్చారు. అయితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ నిరసనలపై అణచివేత చర్యలకు దిగుతోంది. తూటాలు, అరెస్టులు, ఇంటర్నెట్ బ్లాకింగ్… ఇలా ప్రతి మార్గంలో ప్రజల స్వరాన్ని అణచే ప్రయత్నం జరుగుతోంది. అయినా ఉద్యమం తగ్గడం లేదు, మరింత బలపడుతోంది.
ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఇరాన్‌లో నెలకొన్న అశాంతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారుల నుంచి మిలిటరీ యాక్షన్‌పై బ్రీఫింగ్ ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలు, ముఖ్య నేతల భద్రతా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఆప్షన్లను పరిశీలించినట్లు సమాచారం. ఇప్పటికే ట్రంప్ సోషల్ మీడియాలో “ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అని పోస్టు చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఒకవైపు దేశంలో ప్రజలు రక్తంతో తమ హక్కుల కోసం పోరాడుతుంటే, మరోవైపు అంతర్జాతీయ శక్తులు ఈ పరిణామాలను వ్యూహాత్మకంగా గమనిస్తున్నాయి.
ఇరాన్‌లో జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒక దేశపు అంతర్గత సమస్య కాదు. ఇది నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం సాగుతున్న దీర్ఘ పోరాటానికి ప్రతీకగా మారుతోంది. యువకుడి ఒక్క మాట ఇక ఇది ఆగదు ఇప్పుడు ఇరాన్ ప్రజల సంకల్ప వాక్యంగా మారింది. ఎంతటి అణచివేత ఎదురైనా, ఎంతటి బలప్రయోగం జరిగినా, స్వేచ్ఛ కోసం చెలరేగిన ఈ ఉద్యమం ఇక వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.