ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక పర్యాటక ప్రాంతం గండికోట మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న గండికోట (Gandikota) లో నేటి నుంచి మూడు రోజుల పాటు వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యాటకులు, చరిత్రాభిమానులు, సాహస క్రీడల ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు మూడు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని సమాచారం. గండికోట ముఖద్వారం సమీపంలో నాలుగు వేల మంది ఒకేసారి కూర్చొని కార్యక్రమాలు వీక్షించేలా విశాలమైన ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు 35 స్టాళ్లతో కూడిన ఫుడ్ కోర్టును సిద్ధం చేశారు. స్థానిక వంటకాలతో పాటు సంప్రదాయ ఆహార రుచులను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
గండికోట ఉత్సవాల్లో (Gandikota Heritage Festiva) ఈసారి సాహస వినోదాలకు పెద్దపీట వేశారు. పెన్నా నది లోయ, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాల అందాలను ఆకాశం నుంచి వీక్షించేలా హెలికాప్టర్ రైడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పారా మోటర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాలు, పారాచూట్ విన్యాసాలు, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రకృతి అందాలతో పాటు అడ్వెంచర్ అనుభూతిని ఒకేసారి అందించడమే ఈ ఉత్సవాల ప్రత్యేకతగా అధికారులు చెబుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవాలకు మరింత వైభవం చేకూర్చనున్నాయి. గండికోట శోభాయాత్రతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మంత్రులు ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రముఖ రచయితలు, చరిత్రకారులు గండికోట చరిత్ర, దాని విశిష్టతపై ప్రసంగాలు చేయనున్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, థీమ్ సాంగ్ డాన్స్‌లు, ముషాయిరా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. రాత్రివేళ గండికోట (Gandikota Tourism) చరిత్రను ప్రతిబింబించే లేజర్ షో, ప్రముఖ గాయని మంగ్లీ బృందం సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల నుంచి గండికోటకు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.
చారిత్రకంగా గండికోటకు అపారమైన ప్రాధాన్యం ఉంది. ‘భారతదేశ గ్రాండ్ కేన్యన్’గా పేరుగాంచిన పెన్నా లోయ, రంగనాథస్వామి ఆలయం, జుమ్మా మసీదు, మాధవరాయ ఆలయం, ధాన్యాగారం, కత్తుల కోనేరు వంటి కట్టడాలు నేటికీ రాజుల కాలం నాటి శిల్ప సోయగాన్ని గుర్తు చేస్తాయి. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం వేళల్లో గండికోట అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
ఈ ఉత్సవాల (AP Cultural Events) ద్వారా గండికోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పర్యాటకం పెరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంత అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ గండికోట వారసత్వ ఉత్సవాలు సందర్శకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనున్నాయి.