ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో విస్తృత సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమైంది. భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ వివరాల సవరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఈ తప్పుల సవరణ కోసం జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తహసీల్దార్లే ఈ పనిని చేపడతారు.
తహసీల్దార్లకు భూకేటాయింపులు, భూసేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటి కీలక అధికారాలను ప్రభుత్వం అప్పగించింది. అలాగే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యుటేషన్ సవరణలు, ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) లోని తప్పుల సరిదిద్దే బాధ్యతలను ఆర్డీవోల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చే అధికారం మాత్రం జాయింట్ కలెక్టర్ల వద్దనే కొనసాగనుంది.
ఈ మార్పులకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. భూములకు సంబంధించిన ప్రతి అంశం తహసీల్దార్ నుంచి కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు డిజిటల్ రూపంలో సమాచారం చేరేలా వ్యవస్థ రూపొందించారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగనుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ప్రజలు భూ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అధికారాల వికేంద్రీకరణతో భూ సంబంధిత పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో కోర్టు ఉత్తర్వుల అమలు కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిలోనే ఈ పనులు పూర్తవుతాయి. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండడం, మరణించిన వారి పేర్లతో ఖాతాలు కొనసాగడం వంటి సమస్యలను కూడా ఈ కొత్త విధానం ద్వారా సరిచేయనున్నారు. దీనివల్ల భూమి రికార్డులు మరింత పారదర్శకంగా మారతాయి.
ఎసైన్డ్ భూములు, జీరో ఖాతాలు, పాత డాక్యుమెంట్ల ఆధారంగా కూడా మ్యుటేషన్లకు అవకాశం కల్పించారు. 2000 సంవత్సరానికి ముందు ఉన్న పత్రాలను స్కాన్ చేసి డిజిటల్‌గా చేర్చనున్నారు. ఈ సంస్కరణల అమలుపై జిల్లా కలెక్టర్లతో వారానికోసారి సమీక్షలు నిర్వహించనున్నారు. లక్షలాది పెండింగ్ భూ సమస్యలకు ఈ మార్పులు శాశ్వత పరిష్కారం చూపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.