ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనుండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు సిద్ధమైంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే మరికొన్ని కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం–2025 వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.
కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ప్రధానంగా చట్ట నిర్మాణాన్ని సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఉన్న 47 చాప్టర్లను 23కి తగ్గిస్తూ కీలక మార్పులు చేసింది. అలాగే 819 సెక్షన్లను కుదించి 536 సెక్షన్లకు పరిమితం చేసింది. షెడ్యూల్స్ సంఖ్యను కూడా 16కి తగ్గించారు. ఇప్పటివరకు సెక్షన్–10లో ఉన్న వివిధ మినహాయింపులను ఇప్పుడు షెడ్యూల్స్‌లో చేర్చడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వాడుకలో లేని, గందరగోళం కలిగించే పదాలను పూర్తిగా తొలగించారు.
ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తరచూ ఎదుర్కొనే అసెస్‌మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వంటి పదజాలంపై ఉన్న అయోమయానికి కూడా కొత్త చట్టం ముగింపు పలికింది. ఇకపై ‘పన్ను సంవత్సరం’ అనే ఒక్క పదాన్నే ఉపయోగించనున్నారు. దీని ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అలాగే ఇప్పటివరకు వేర్వేరు సెక్షన్లలో ఉన్న టీడీఎస్ (TDS) నిబంధనలను ఒకే సెక్షన్‌లోకి తీసుకువచ్చారు. ఐటీ రైడ్స్ విషయంలోనూ భారీ మార్పులు చేశారు. ఇప్పటివరకు ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమైన తనిఖీలు ఇకపై ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, క్లౌడ్ సర్వర్లు వరకు విస్తరించనున్నాయి.
కొత్త ఆదాయపు పన్ను చట్టంలో పాత పదజాలానికి పూర్తిగా ఎండ్ కార్డ్ వేస్తూ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త పదాలను ప్రవేశపెట్టారు. క్రిప్టో కరెన్సీ, వర్చువల్ డిజిటల్ అసెట్స్‌కు సంబంధించిన లావాదేవీలను స్పష్టంగా చట్ట పరిధిలోకి తీసుకువచ్చారు. దీనితో పాటు ఐటీ అధికారులకు రైడ్స్, దర్యాప్తుల విషయంలో విస్తృత అధికారాలు కల్పించారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదాయపు పన్ను చట్టం–2025 అమల్లోకి రానుంది. ఈ మార్పులు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.