సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగకు స్వగ్రామానికి వెళ్లాల్సిందే అన్న భావన ప్రతి కుటుంబంలో ఉంటుంది. అందుకే మూడు నెలల ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. అయినప్పటికీ సంక్రాంతి సమయానికి రైళ్లలో రిజర్వేషన్లు దొరకకపోవడం, రెగ్యులర్ బస్సులు నిండిపోవడం సాధారణమైపోయింది. దీంతో చాలా మంది సొంత వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్, లేదా ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోవడం చూస్తే, పండుగ వలస మొదలైందని అర్థమవుతోంది. క్రిస్మస్‌కు ముందే కొంతమంది స్వగ్రామాలకు చేరుకోగా, ఇప్పుడు మిగతావారంతా సంక్రాంతి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో సంక్రాంతికి ఊరు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. రైళ్లలో సీట్లు దొరకక, ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలతో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్ (BHEL), మియాపూర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారింది. బీహెచ్‌ఈఎల్ డిపో (ఆర్సీపురం) నుంచి నేరుగా ఏపీకి ప్రత్యేక సర్వీసులు ప్రారంభించనున్నట్లు డిపో అధికారులు వెల్లడించారు.
ఈ స్పెషల్ బస్సుల రూట్ ప్లాన్ కూడా ప్రయాణికులకు అనుకూలంగా రూపొందించారు. బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరే ఈ బస్సులు మియాపూర్, కేపీహెచ్‌బీ వరకు ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. కేపీహెచ్‌బీ చివరి పికప్ పాయింట్‌గా ఉండగా, అక్కడి నుంచి నగరంలోకి వెళ్లకుండా నేరుగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక సర్వీసులు విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం వంటి ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాలకు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో దీర్ఘ ప్రయాణంలో సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయని ఆర్టీసీ భావిస్తోంది.
జనవరి 9 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. స్పెషల్ బస్సుల వివరాల కోసం 9959226149 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు భారీగా పెంచుతున్న ఈ సమయంలో, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ రేట్లకే ఈ బస్సులు నడపడం విశేషం. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగ ప్రయాణాన్ని సురక్షితంగా, చౌకగా పూర్తి చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.