ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేలా నిడమర్రు జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా ఈ స్కూల్‌లో ఉన్న గ్రౌండ్ అచ్చం ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ను తలపించేలా ఉండటంతో సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వ స్కూల్ అంటే ఇదేనా అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నిడమర్రు జడ్పీ హైస్కూల్‌లో దాదాపు రూ.14–15 కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న జీ+1 భవనంపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. మొత్తం 22 గదులతో కూడిన ఈ భవనాలను ఆధునికీకరిస్తూ, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొత్త అంతస్తులో ఇండోర్ స్టేడియం, యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఈ పాఠశాల ప్రత్యేకత కేవలం భవనాలకే పరిమితం కాదు. స్కూల్ ప్రాంగణంలో ప్లాస్టిక్ మ్యాట్‌తో కూడిన ప్లే గ్రౌండ్, చుట్టూ వాకింగ్, రన్నింగ్ ట్రాక్, పక్కనే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. అలాగే త్వరలోనే జూనియర్ కాలేజీ కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూ ఆకారంలో నిర్మించిన ఈ పాఠశాల డిజైన్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సమతుల్యంగా సాగేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు.
లీప్ పాఠశాలల లక్ష్యం విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు నైపుణ్యాలు నేర్పించడం. ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్ సదుపాయాలు, సైన్స్ ప్రయోగాలకు అవసరమైన మోడర్న్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే నిడమర్రు జడ్పీ హైస్కూల్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.