ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి కోసం భూసమీకరణ చేపట్టి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇప్పటివరకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు పెద్ద సమస్యగా మారాయి. ఆ పట్టాల్లో “అసైన్డ్” అనే పదం ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులను మోసం చేశారు. భూముల విలువ గజానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తక్కువగా చూపించి కొనుగోళ్లు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అంశంపై రైతులు పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయగా, ఇప్పుడు వారి ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.
అమరావతి కోసం మొత్తం 3,139 మంది అసైన్డ్ రైతులు సుమారు 2,689.14 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల్లో ఉన్న “అసైన్డ్” పదం కారణంగా యాజమాన్య హక్కులపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బ్యాంకు రుణాలు, అమ్మకాలు, లావాదేవీలు అన్నీ సమస్యాత్మకంగా మారాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కౌలు బకాయిలు, సీఐడీ కేసుల వంటి అంశాలను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టాల విషయంలోనూ స్పష్టత తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో పురపాలక శాఖ గత ఏడాది అక్టోబర్‌లో జీవో నంబర్ 187ను జారీ చేసింది. భూసమీకరణ చట్టంలో మార్పులు చేసి, రిటర్నబుల్ ప్లాట్లకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఈ జీవోలో సూచించింది. అయితే ఈ జీవో కొత్తగా ఇచ్చే పట్టాలకే వర్తిస్తుందని సీఆర్డీఏ స్పష్టం చేయడంతో అప్పటికే పట్టాలు పొందిన రైతుల్లో గందరగోళం నెలకొంది. దాదాపు 95 శాతం మంది రైతులు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించి, తమ సమస్యకు కూడా అదే పరిష్కారం వర్తింపజేయాలని కోరారు.
రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన పాత రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల స్థానంలో, “అసైన్డ్” పదం తొలగించి కొత్త పట్టాలు జారీ చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కొత్త ఏడాదిలో కొత్త పట్టాలు అందించనుంది. దీంతో దళారుల మోసాలకు చెక్ పడటంతో పాటు, రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అమరావతి భూసమీకరణలో భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇది నిజంగా పెద్ద ఊరటగా మారింది.