ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ పండుగ వాతావరణం నెలకొంది. జనవరి నెల అంటేనే సెలవులు, సంబరాలు, కుటుంబ సమేతంగా పండుగలు జరుపుకునే సమయం. ఈ నేపథ్యంలో 2026 జనవరి నెలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వరుసగా తొమ్మిది రోజులపాటు సెలవులు ఉండటం గమనార్హం. దీంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సాధారణ సెలవుల విషయానికి వస్తే, జనవరి 2026లో మొత్తం 9 సెలవులు ఉన్నాయి. జనవరి 4 (ఆదివారం), 10 (రెండో శనివారం), 11 (ఆదివారం) సాధారణ వారాంతపు సెలవులు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. వీటితో పాటు జనవరి 18, 25 తేదీల్లో ఆదివారాలు, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. మొత్తం 31 రోజులున్న జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 22 పని దినాలు మాత్రమే ఉన్నాయి. అదనంగా నూతన సంవత్సరం (జనవరి 1), హజ్రత్ అలీ జయంతి (జనవరి 3), షబ్-ఎ-మెరాజ్ (జనవరి 16) రోజులను ఆప్షనల్ హాలిడేస్‌గా ప్రకటించారు.
ఇక స్కూల్ విద్యార్థుల విషయంలో చూస్తే, జనవరి నెల మరింత ప్రత్యేకంగా మారింది. సాధారణ ఆదివారాలు, రెండో శనివారంతో పాటు సంక్రాంతి సెలవులు కలిపి మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. జనవరి 12 నుంచి 17 వరకు వరుసగా ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. భోగి, సంక్రాంతి, కనుమ మాత్రమే కాకుండా ముందురోజులు, తరువాతి రోజులను కూడా సెలవులుగా ప్రకటించడంతో విద్యార్థులకు దీర్ఘ విరామం లభించింది. జనవరి 18 ఆదివారం కూడా కలవడంతో కుటుంబాలతో పండుగలకు వెళ్లేందుకు అనుకూలంగా మారింది.
మొత్తంగా చూస్తే 2026 జనవరి నెలలో ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు సెలవుల పండుగే అని చెప్పవచ్చు. సంక్రాంతి వేడుకలకు ఊర్లు వెళ్లేవారికి ఈ సెలవుల షెడ్యూల్ ఎంతో ఉపయోగపడనుంది. రవాణా, పర్యాటక, వాణిజ్య రంగాలపై కూడా ఈ సెలవుల ప్రభావం కనిపించనుంది. ఇప్పటికే బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే తమ ప్రయాణాలు, పనులను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.