కర్నూలు జిల్లా బళ్లారిలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి నుంచి బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాలు, గాలి జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు చివరకు హింసాత్మక దాడులకు దారి తీశాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఉద్రిక్తతకు కారణంగా రేపు బళ్లారిలో జరగనున్న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మారింది. కాంగ్రెస్ వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా, దీనికి ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, రాళ్ల దాడులకు దారి తీసింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు మాట్లాడుతూ, పోలీసులు మరియు భరత్ రెడ్డి వర్గీయులు తమపై, తమ కుటుంబసభ్యులపై, కార్యకర్తలపై కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు మాత్రం గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల కాల్పుల వల్లే తమ కార్యకర్త మరణించాడని ఆరోపిస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బళ్లారి నగరమంతా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
బళ్లారిలో చోటుచేసుకున్న ఈ ఘర్షణ వెనుక రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ కక్షలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి మధ్య ఉన్న పాత విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అంటున్నారు. సూర్యనారాయణ రెడ్డి కుమారుడే ప్రస్తుత బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కావడంతో, ఈ రాజకీయ ప్రత్యర్థిత్వం మరింత తీవ్రమైంది. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఈ రెండు వర్గాల మధ్య మంటలు రేపిన అంశంగా మారింది. మాజీ మంత్రి శ్రీరాములు స్వయంగా జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదు.
న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుని గంగావతి నుంచి బళ్లారికి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కారుపై, అనంతరం ఆయన ఇంటిపై రాళ్ల దాడులు, కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు బళ్లారి అంతటా 144 సెక్షన్ అమలు చేశారు. ఇదిలా ఉండగా, గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు సహా పలువురు నేతలపై పోలీసులు హత్య కేసులు నమోదు చేశారు. తమపై మాత్రమే కేసులు పెట్టడంపై గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.